ఆ అవినీతి ఎలుకల కోసం ఇల్లు తగలబెడతారా?.. సుమలతపై రఘు మాస్టర్ ఫైర్!

ఆ అవినీతి ఎలుకల కోసం ఇల్లు తగలబెడతారా?.. సుమలతపై రఘు మాస్టర్ ఫైర్!

తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రేగిన వివాదం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. జానీ మాస్టర్ సతీమణి, అధ్యక్షురాలు సుమలతని పదవి నుంచి తొలగిస్తూ ఫెడరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేయడంతో మొదలైన ఈ రగడ.. రోజురోజుకూ తీవ్ర ఆరోపణలు, పోలీస్ కేసులతో పీక్స్‌కు చేరింది. లేటెస్ట్ గా శనివారం( సెప్టెంబర్ 26, 2026 )  ఫిల్మ్ ఛాంబర్‌లో రఘు మాస్టర్, సత్య మాస్టర్, అజయ్ మాస్టర్, రాజన్న మాస్టర్‌లతో కూడిన సీనియర్ల వర్గం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు  సుమలత తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ నలుగురి స్వార్థం కోసం ..

మీడియా సమావేశంలో సుమలత తీరుపై రఘు మాస్టర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "యూనియన్‌లో దాదాపు 600 మంది సభ్యులు ఉంటే, కేవలం నలుగురి స్వార్థం కోసం మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆ నాలుగు అవినీతి ఎలుకల కోసం ఇల్లు తగలబెడతారా?" అని  ప్రశ్నించారు. జనరల్ బాడీ మీటింగ్‌లో యూనియన్ మినిట్స్ బుక్‌ను సుమలత లాక్కోవడానికి ప్రయత్నించగా, లేడీ డ్యాన్సర్లు అడ్డుకున్నారని వెల్లడించారు. సదుద్దేశంతో అకౌంట్ ఫ్రీజ్ చేస్తే, తమపై ఫోర్జరీ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అక్టోబర్ 11న ఎన్నికలు.. 

సభ్యులందరి ఆమోదంతో అక్టోబర్ 11న ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చామని రఘు మాస్టర్ తెలిపారు. జానీ మాస్టర్‌పై ఉన్న ‘నాన్-కోఆపరేషన్’ను తొలగించాలని కోరుతూనే, ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. సత్య మాస్టర్ మాట్లాడుతూ.. వందలాది మంది డ్యాన్సర్లు రఘు మాస్టర్ ఇంటికి వెళ్లి ఆయన్ను ప్రెసిడెంట్‌గా ఉండాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. 

►ALSO READ | జిలుగుల తార.. ప్రేమ జ్వాల.. రణబీర్, అలియా భట్ లవ్ అండ్ వార్

సుమలత అసోసియేషన్ కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదని, మైకులు లాక్కొని సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని డాన్స్ మాస్టర్ అజయ్ ఆరోపించారు. సుమలత విభజించి పాలించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సుమలత బెదిరింపులకు భయపడేది లేదని, డ్యాన్సర్ల భవిష్యత్తు కోసం అక్టోబర్ 11న జరిగే పోలింగే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారమని సీనియర్లు తేల్చిచెప్పారు.. దీంతో  డ్యాన్సర్స్ అసోసియేషన్ పోరు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది..