గుప్త నిధుల కోసం తవ్వకాలు.. శాతవాహనుల గుడి ఆవరణలో ఘటన

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. శాతవాహనుల గుడి ఆవరణలో ఘటన

ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో గుప్త నిధుల కోసం నిందితులు మళ్లీ రెచ్చిపోయారు. దేవుడి మాన్యం, చారిత్రక ఆనవాళ్లు అని కూడా చూడకుండా ఏకంగా జేసీబీతో పురాతన కట్టడాన్ని ధ్వంసం చేస్తూ తవ్వకాలు చేపట్టారు. ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ సందెరేల్లి దేవస్థానాన్ని ఆనుకుని ఉన్న చారిత్రక ప్రదేశంలో తవ్వకాలు జరిపిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

శాతవాహనుల కాలం నాటి పురాతన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే జేసీబీతో భారీగా తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ ఆలయంలోని భారీ శివలింగాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం పలుమార్లు తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు.