రాబోయే రోజుల్లో ఎల్నినో ముప్పు పొంచి ఉంది.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగు నీటి కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రస్తుతం రిజర్వాయర్లతో తగినంత తాగునీటి నిల్వలు ఉన్నప్పటికీ సింగూరు ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, ప్రత్యేక అధికారిని నియమించి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. నిజాంసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశారు.
వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలానికి త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేయాలని సీతక్క చెప్పారు. ఈ కమిటీలు ఇప్పటి నుంచే మండలాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను అవసరానికి అనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోని చెంచు పెంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.
►ALSO READ | జనగామ జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ ఆస్తులు జప్తు
వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున ఉపాధి హామీ పనులను పెంచాలని మంత్రి సూచించారు. ఉపాధి హామీ పనుల కోసం రూ.6 వేల కోట్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు. ఆ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు, జల సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. జలసిరి కార్యక్రమం కింద ఇప్పటికే ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి సీతక్క.
దీంతోపాటు హ్యామ్ ప్రాజెక్టు కింద పైన తెలిపిన నాలుగు జిల్లాల్లో 3వేల861 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించేందుకు రూ.3వేల382 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు నిర్మాణ పనులకు అనువైన కాలం కావడంతో ఈ సమయంలో పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఆవాసం నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు మంత్రి సీతక్క.
