న్యూఢిల్లీ: ఇండియాలో సోలార్ పవర్‌ప్రాజెక్టుల కోసం అధికారులకు లంచం ఇచ్చినట్టు నమోదైన కేసుల్లో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి విముక్తి దొరికింది. వీరిపై క్రిమినల్ కేసులను యూఎస్ ఫెడరల్ జడ్జి శాశ్వతంగా కొట్టివేశారు. దాదాపు రెండేళ్లుగా అదానీ గ్రూప్‌ను వెంటాడుతున్న చట్టపరమైన ఇబ్బంది తొలగిపోయింది. న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికొలస్ గారౌఫిస్ ఈ మేరకు తీర్పు చెప్పారు. ఈ నిర్ణయాన్ని అదానీ స్వాగతించారు.
న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. ఈనెల 10న జారీ చేసిన 147 పేజీల ఉత్తర్వులో జడ్జి రూల్ 48 ఏ కింద అభియోగాలను కొట్టివేశారు. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు వీగిపోయాయి. ఈ తీర్పుతో ఆ కేసులు మళ్లీ పెట్టడానికి వీలు ఉండదు. అయితే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘనలు సహా కొన్ని అంశాలపై జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. విచారణ లేకుండానే ఈ నిర్ణయం వెలువడింది. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విస్తృత సమీక్ష తర్వాత కేసు కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరింది.
