రిఫామ్స్‌‌‌‌ ను వ్యతిరేకించేవాళ్లే.. యూఎన్ ను వాడుకుంటున్నరు.. సంస్థపై ఆ దేశాలకు శ్రద్ధ లేదు: జైశంకర్

రిఫామ్స్‌‌‌‌ ను వ్యతిరేకించేవాళ్లే.. యూఎన్ ను వాడుకుంటున్నరు.. సంస్థపై ఆ దేశాలకు శ్రద్ధ లేదు: జైశంకర్

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను వ్యతిరేకించేవారు కేవలం ఆ సంస్థను వాడుకుంటున్నారని, సంస్థపై వారికి నిజమైన శ్రద్ధ లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫైర్ అయ్యారు. యునైటెడ్ నేషన్స్‌‌‌‌లో సంస్కరణల డిమాండ్ రోజురోజుకూ బలపడుతోందని, రిఫామ్స్ దిశగా ముందడుగు పడకపోవడంపై అనేక దేశాల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందన్నారు. న్యూయార్క్‌‌‌‌లో యునైటెడ్ నేషన్స్ 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన మినిస్టీరియల్ సెషన్‌‌‌‌లో జైశంకర్ మాట్లాడారు.

‘‘సంస్కరణలను వ్యతిరేకించేవారు నిజంగా ఐక్యరాజ్యసమితిని పట్టించుకోనివారే. వారు సంస్థను వాడుకుంటున్నారు తప్ప, దానిని పట్టించుకోవడం లేదు” అని మండిపడ్డారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ వాస్తవాలను ఐక్యరాజ్యసమితి ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు బలంగా భావిస్తున్నాయని తెలిపారు. సమకాలీన ప్రపంచానికి తగినట్టుగా ఈ సంస్థను మార్చడానికి సంస్కరణలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. 

ఏకాభిప్రాయం ద్వారా ఐక్యరాజ్యసమితి సంస్కరణలను సాధించగలమనే ఆలోచనను కూడా జైశంకర్ తోసిపుచ్చారు. సభ్య దేశాలు నిర్ణయం తీసుకునే ముందు ఒక టెక్స్ట్ తయారు చేసి చర్చించాలన్నారు. సంస్కరణలపై ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య తీర్మానానికి రాకముందు దేశాలు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అవకాశం కల్పించాలన్నారు. అలాగే, ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్‌‌‌‌గా మహిళ ఉండాలనే ఆలోచన ‘తిరోగమనం కాదు.. పురోగమనం’ అని అభిప్రాయపడ్డారు.