మిలియన్ల కొద్దీ వ్యూస్ కోసం, సంపాదన కోసం కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హోం టూర్స్ పేరుతో ఇంట్లో ఉన్నవన్నీ చూపిస్తుంటారు. దొంగలకు అదే వరంగా మారింది. హోం టూర్ల పేరుతో బంగారం, ఇంట్లో ఉన్న డబ్బును చూపిస్తూ ఒక యూట్యూబర్ వీడియోలు చేసింది. అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ ఇంట్లో చోరీ జరిగింది.
This Youtuber from KanyaKumari showed off her money & jewelry in the vlog.
— Vije (@vijeshetty) September 25, 2026
Thieves broke the house & stole 1 Cr. worth of jewelry.pic.twitter.com/WEebM03dkZ
తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన యూట్యూబర్లు వినోద్ కుమార్, మధుమితల ఇంట్లో దొంగతనం జరిగింది. సుమారూ కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. సోషల్ మీడియాలో ఖరీదైన వస్తువులను ప్రదర్శించడం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. ఈ జంట ఇంట్లో ఉన్న 118 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు, పెద్ద మొత్తంలో తమ ఇంట్లో ఉన్న డబ్బు గురించి వీడియో చేశారు. ఈ వీడియో చూసిన దొంగలు చోరీ చేసి సదరు యూట్యూబర్ జంటకు షాకిచ్చారు.
ఎక్స్ పోజింగ్ చేస్తూ.. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బును చూపిస్తూ ఆమె చేసిన వీడియోలు వైరల్ కావడం, మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో అదే కంటెంట్తో వీడియోలు చేశారు. దొంగతనం జరగడానికి కొద్దిసేపటి ముందు కూడా.. మధుమిత తమ పూజ గదిలోని సంపదను చూపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం.
పోలీసులు ఈ చోరీ గురించి చెబుతూ.. దొంగలు వెనుక తలుపు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇల్లు సీసీటీవీ నిఘా ఉన్న గేటెడ్ ప్రాంతంలో ఉన్నప్పటికీ, దుండగులు లోపలికి చొరబడి విలువైన వస్తువులతో పారిపోయారు. దొంగిలించబడిన బంగారం విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అంచనా.
