సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్.. ఏటీఎంల్లో విత్ డ్రాలపై ఛార్జీలను ఎత్తేసిన బ్యాంకులు !

సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్.. ఏటీఎంల్లో విత్ డ్రాలపై ఛార్జీలను ఎత్తేసిన బ్యాంకులు !

సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వ రంగ బ్యాంకులు వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను తాత్కాలికంగా ఎత్తివేశాయి.

సమ్మె జరిగే మూడు రోజులు ఎన్నిసార్లు డబ్బులు విత్ డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి.

2026 సెప్టెంబర్ 28 నుంచి 30 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ  రంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంల్లో ఎన్నిసార్లు అయినా పూర్తి ఉచితంగా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకు సమ్మె నేపథ్యంలో.. సెప్టెంబర్ 27న ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని ఇప్పటికే పలు బ్యాంకులు కస్టమర్లకు నోటిఫికేషన్ పంపించిన సంగతి తెలిసిందే. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ, ఇతర డిజిటల్ సేవలు యథావిధిగా నిరంతరాయంగా కొనసాగుతాయని బ్యాంకులు స్పష్టం చేశాయి.

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌‌‌‌బీయూ) పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వీకెండ్ కావడంతో.. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.

వారానికి 5 రోజుల బ్యాంకింగ్ పనిదినాలు అమలు చేయాలని, ఉద్యోగులందరికీ ఒకేలా డీఏ లెక్కించాలని, ఎన్‌‌‌‌పీఎస్  ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఎంచుకునే అవకాశం కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.