వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ( డబ్ల్యూఈఎఫ్) తన చారిత్రాత్మక 20వ వార్షిక సంచికగా ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2026’ ను విడుదల చేసింది. 2006లో మొదటిసారిగా ప్రారంభమైన ఈ సూచీ, రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదాల్లో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా పరిశోధిస్తుంది.
2026 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం లింగ సమానత్వ స్కోరు 69.2 శాతానికి చేరింది. ప్రపంచం క్రమంగా సమానత్వం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, ప్రస్తుతం నమోదవుతున్న పురోగతి వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే పూర్తిస్థాయి లింగ సమానత్వాన్ని సాధించడానికి ప్రపంచానికి ఇంకా దాదాపు 120 సంవత్సరాలు పడుతుందని ఈ నివేదిక హెచ్చరించింది.
ఈ నివేదికలో ఐస్‌లాండ్ 93 శాతం సమానత్వ స్కోరుతో వరుసగా 17వ సారి ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఫిన్‌లాండ్, నార్వే, నమీబియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ స్థితిగతులను పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2026 నివేదికలో అధ్యయనం చేసిన 145 దేశాల జాబితాలో భారతదేశం 131వ స్థానాన్ని పొందింది. దేశం మొత్తం మీద 64.5 శాతం లింగ అంతరాన్ని పూడ్చగలిగింది.
2006 నుంచి ఇప్పటివరకు భారత్ తన మొత్తం స్కోరులో 4.3 శాతం మేర మెరుగుదల కనబరిచినప్పటికీ... ప్రపంచ సగటు (69.2%) కంటే గణనీయంగా వెనుకబడి ఉంది. ఆరోగ్యం, విద్యారంగాల్లో భారత్ దాదాపు పూర్తి సమానత్వ దిశగా పయనిస్తున్నప్పటికీ.. ఆర్థిక భాగస్వామ్యం, రాజకీయ నిర్ణయాధికారాల్లో నెలకొన్న అగాధం దేశ ర్యాంకును దిగువకు నెట్టివేస్తోంది. భారతదేశం అత్యంత సానుకూల ఫలితాలను నమోదు చేస్తున్న ఏకైక రంగం విద్యా సాధన.
2026 నివేదిక ప్రకారం భారత్ ఈ రంగంలో 96.6 శాతం సమానత్వ స్కోరును సాధించింది. ప్రాథమిక, మాధ్యమిక (సెకండరీ), ఉన్నత విద్య (టెర్షియరీ) నమోదులో భారత్ దాదాపు సంపూర్ణ సమానత్వాన్ని సాధించింది. గత రెండు దశాబ్దాలుగా 'సర్వశిక్షా అభియాన్', 'బేటీ బచావో- బేటీ పడావో', మధ్యాహ్న భోజన పథకం, అలాగే బాలికల కోసం ప్రత్యేక హాస్టళ్లు, సైకిళ్ల పంపిణీ వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు బడుల్లో బాలికల డ్రాపౌట్ రేటును తగ్గించడంలో కీలకపాత్ర పోషించాయి.
ఆరోగ్యం, జీవనం విభాగంలో భారతదేశం 95.6 శాతం సమానత్వం
వయోజన అక్షరాస్యతలో లింగ సమానత్వం ఇప్పటికీ 82.5 శాతం వద్దే ఉంది. అంటే, వయోజన జనాభాలో నిరక్షరాస్యులైన మహిళల సంఖ్య పురుషుల కంటే చాలా ఎక్కువ. మరోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాలలో ఉన్నత విద్యను పూర్తి చేస్తున్న యువతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు, కెరీర్ స్థిరత్వం ఆశాజనకంగా లేదు.
ఉన్నత విద్యలో చేరిక పెరిగినంత వేగంగా, డిగ్రీలు పొందిన మహిళలు అధికారిక ఆర్థిక మార్కెట్లోకి ప్రవేశించలేకపోవడం ఒక ముఖ్యమైన సామాజిక వైరుధ్యంగా మిగిలిపోయింది. ఆరోగ్యం, జీవనం విభాగంలో భారతదేశం 95.6 శాతం సమానత్వాన్ని నమోదు చేసింది.
సంస్థాగత ప్రసవాల పెంపుదల, 'జననీ సురక్ష యోజన' వంటి పథకాల సక్రమ అమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నెట్‌వర్క్ విస్తరణ వల్ల దేశంలో మాతా మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2017 నుంచి క్రమంగా మెరుగుపడుతున్న ధోరణి కనిపిస్తున్నప్పటికీ, 2026 నాటికి కూడా భారత్ జనన లింగ నిష్పత్తి 2006 నాటి స్థాయి కంటే దాదాపు ఒక శాతం తక్కువగానే ఉందని నివేదిక ప్రస్తావించింది. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న 'కుమారుల పట్ల మొగ్గు', అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు బాలికల జననాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
ఆర్థిక భాగస్వామ్యం ఆందోళనకరం
భారతదేశం ఎదుర్కొంటున్న ఆందోళనకరమైన విభాగం ఆర్థిక భాగస్వామ్యం. 2026 నివేదికలో ఈ ఉప-సూచీలో భారత్ కేవలం 41.2 శాతం స్కోరుతో 145 దేశాల్లో 143వ స్థానంలో అట్టడుగున నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలాన్ని (2006-–2026) పరిశీలిస్తే దేశం సాధించిన ఆర్థికవృద్ధికి అనుగుణంగా మహిళల ఆర్థిక సాధికారత పెరగకపోగా స్తబ్ధతకు గురైంది. 2013లో భారత్ సాధించిన గరిష్ట స్కోరు 44.7 శాతం కాగా, ఇప్పటికీ దేశం ఆ స్థాయి కంటే 3.5 శాతం దిగువనే కొనసాగుతోంది.
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్-2026 నివేదిక భారతీయ మహిళల వాస్తవిక స్థితిగతులపై ఒక స్పష్టమైన ఆలోచింపజేసే చిత్రాన్ని ఆవిష్కరించింది. విద్య, సాంకేతిక రంగాలలో మహిళలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో, కీలక నిర్ణయాధికార స్థానాల్లో వారి భాగస్వామ్యం ఇంకా తీవ్ర అసమానతల మధ్యే కొట్టుమిట్టాడుతోంది.
పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలం
సమాజంలో పురుషుడు ఆర్జించే ప్రతి వంద రూపాయలకు మహిళకు లభిస్తున్నది కేవలం 35 రూపాయలు మాత్రమే. వృత్తి, సాంకేతిక నిపుణుల విభాగంలో మహిళల వాటా దాదాపు 50 శాతానికి చేరినప్పటికీ, బోర్డు రూమ్‌లు, మేనేజర్ స్థాయి నాయకత్వ పదవుల్లో వారి ప్రాతినిధ్యం 13.1 శాతానికే పరిమితం కావడం 'గ్లాస్ సీలింగ్' అవరోధం ఇంకా ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది.
రాజకీయ రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 67వ స్థానంలో నిలిచినట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. గత 50 ఏళ్ల కాలంలో దేశాధినేతలుగా పనిచేసిన మహిళా నాయకుల చరిత్ర ఆధారంగానే ఈ ర్యాంకు దక్కింది తప్ప, ప్రస్తుత ప్రాతినిధ్యం ఆధారంగా కాదు. దీనికి నిదర్శనంగా భారత పార్లమెంటులో మహిళల వాటా కేవలం 16.1 శాతంగా, కేంద్ర మంత్రివర్గంలో వారి భాగస్వామ్యం కేవలం 5.9 శాతానికి పడిపోవడం కనిపిస్తుంది.
స్థానిక సంస్థల్లో 14 లక్షలకు పైగా మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ కొలమానాలు కేవలం కేంద్ర స్థాయి ప్రాతినిధ్యాన్నే పరిగణనలోకి తీసుకోవడం భారత్ స్కోరును దెబ్బతీస్తోంది. ఈ అసమానతలకు విధానపరమైన లోపాల కంటే సమాజంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే ప్రధాన కారణం. భారతీయ మహిళలు పురుషుల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ సమయాన్ని గుర్తింపు లేని గృహ సంరక్షణ శ్రమకే కేటాయిస్తున్నారు. ఇది జీడీపీ గణాంకాల్లో చేరకపోవడంతో వారి శ్రమ ఆర్థికంగా అదృశ్యమైపోతోంది.
మహిళా సాధికారతకు తక్షణ ఊతం అవసరం
సురక్షితమైన రవాణా లేకపోవడం, పని ప్రదేశాల్లో భద్రతా లోపాలు మహిళల ఆర్థికశక్తిని దెబ్బతీస్తుండగా, శ్రామిక మహిళల్లో 80 శాతం మంది ఎలాంటి సామాజిక భద్రత లేని అసంఘటిత రంగంలోనే మగ్గిపోతున్నారు.
భారతదేశం ఆశించే వికసిత్ భారత్ లేదా బహుళ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల సాకారం కావాలంటే మహిళా సాధికారతకు తక్షణ ఊతం అవసరం. చట్టసభలలో 33 శాతం కోటాను కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం'ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయడం ద్వారా రాజకీయ సాధికారతను పెంచవచ్చు.
అలాగే పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాల సభ్యులను 'లఖ్‌పతి దీదీ'లుగా పారిశ్రామిక వేత్తలుగా మార్చడం, సంస్థలలో వార్షిక జెండర్ పే ఆడిట్‌ను తప్పనిసరి చేయడం అత్యవసరం.
అన్నింటికీ మించి, చిన్నతనం నుంచే పాఠశాలల్లో లింగ సున్నితత్వ విద్యను బోధిస్తూ సమాజ ఆలోచనా దృక్పథంలో మార్పు తీసుకురావాలి. లింగ సమానత్వం దేశ సమగ్ర ఆర్థిక, సామాజిక వికాసానికి అత్యంత కీలకమైన చోదక శక్తి.
డా. ఏ. శంకర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
- రచన 700 పదాలకు మించరాదు.
