ఒక కుర్రాడికి పెళ్లైంది. 30 ఏళ్లు తిరిగే లోపు నలుగురు పిల్లలు పుట్టారు. దురదృష్టవశాత్తూ భార్య చనిపోయింది. ఇక.. ఆ పిల్లలకు అమ్మ అయినా, నాన్న అయినా.. అన్నీ తనే. తన జీవితంలో మిగిలిన 30, 40 ఏళ్లు నలుగురు పిల్లల కోసమే కష్టపడాలని నిర్ణయించుకున్నాడు.
రెక్కలు ముక్కలు చేసుకుని తన శక్తినంతా ధారబోసి నలుగురు పిల్లల కోసం కష్టపడ్డాడు. నలుగురూ జీవితంలో నిలదొక్కుకునేలా చేసి ఆస్తిని పంచేశాడు. అదే ఆయన చేసిన తప్పయింది. 70 ఏళ్ల వయసులో తాను చనిపోతే కడుపున పుట్టిన పిల్లలు ఎవరూ తనను కనీసం చూడటానికి కూడా రానంత కర్కోటకులని ఆ పెద్దాయనకు తెలియదు పాపం. ఈ దయనీయ ఘటన.. మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది.
ఇండోర్కు చెందిన ఘనశ్యామ్.. భోపాల్‌లోని ఒక వృద్ధాశ్రమంలో ఒంటరిగా చనిపోయాడు. చిన్న టైర్ల షాపు నడుపుతున్న అతనికి ఒక చిన్న ఇల్లు ఉంది. నలుగురు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరు ఆడ పిల్లలు. నలుగురినీ కష్టపడి పెంచి, పెద్ద చేసి ఆస్తిని పెంచాడు. వృద్ధాశ్రమం నుంచి పదేపదే అతని కొడుకులు, కూతుర్లకు ఫోన్ చేశారు. అతని పిల్లలు ఏ ఒక్కరూ స్పందించలేదు. ఘనశ్యామ్ ఆగష్టు 4న మరణించాడు.
వృద్ధాశ్రమం వారు అతని కుటుంబానికి ఈ విషయం తెలియజేసి, భోపాల్‌కు రమ్మని పదేపదే ఒప్పించేందుకు ప్రయత్నించారు. కర్మకాండలు అలా అనాథగా జరగకూడదని, అంత్యక్రియలు చేసి వెళ్లిపోండని ఘనశ్యామ్ కొడుకులు, కూతుర్లకు ఎంత చెప్పినా ఒక్కరి మనసు కూడా కరగలేదు. ఏవేవో సాకులు చెబుతూ తండ్రిని చివరి చూపు చూసేందుకు కూడా ఒక్కరు రాలేదు.
పైగా.. ఘన శ్యామ్ సంతానంలో కాల్ మాట్లాడిన ఒకరు.. ఆయన తన డబ్బును తోబుట్టువులకు పంచేశారని, తమతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం శోచనీయం. ఆస్తి పంచినప్పటికీ ఇంకా ఏదో కావాలనే స్వార్థం ఘన్ శ్యామ్ కన్న బిడ్డల్లో నిండిపోయింది. ఇక.. ఆయన కొడుకులు, కూతుర్లు రారని అర్థమైపోవడంతో వృద్ధాశ్రమం నిర్వాహకులే పోలీసుల సాయంతో అంత్యక్రియలు ముగించారు.
ఇప్పుడు ఆయన డెత్ సర్టిఫికెట్ కోసం ఆయన కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఆయన మరణ ధృవీకరణ పత్రాన్ని తమకు పంపమని వృద్ధాశ్రమానికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఎందుకో.. ఈ పాటికే అర్థమై ఉంటుంది. కలి కాలంలో బంధాలు, అనుబంధాలు, పిల్లలు.. అన్నీ బూటకమేని ఈ ఘటన రుజువు చేసింది.
