దేశ భవిష్యత్తు ఎక్కడ ఉంది? అది పార్లమెంట్ భవనాల్లోనో... ప్రభుత్వ కార్యాలయాల్లోనో... పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లోనో మాత్రమే లేదు. దేశ యువత చేతుల్లో ఉంది. యువతలో శక్తి, సామర్థ్యం, కొత్తగా ఆలోచించే మేధస్సు ఉంది. సాధించాలనే తపన ఉంది. కానీ ఆ శక్తికి సరైన దిశ, అవకాశాలు, ప్రోత్సాహం లభించకపోతే అదే యువశక్తి నిరాశగా మారే ప్రమాదం ఉంది. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశలా చాటిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రస్తుతం నేటి యువత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది.
చదువుకున్నా ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ఉద్యోగం ఉన్నా తగిన వేతనం లేకపోవడం మరో సమస్య. పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న యువతలో నిరాశ పెరుగుతోంది. కొందరు విదేశాలకు వెళ్లాలని చూస్తుంటే... మరికొందరు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా యువత జీవితంలో ఒక భాగమైపోయింది. సాంకేతికతను ఉపయోగించుకోవడం తప్పు కాదు. కానీ అది మన సమయాన్ని, ఆలోచనలను, లక్ష్యాలను నియంత్రించే స్థాయికి చేరకూడదు.
గ్రామీణ యువతను ప్రోత్సహించాలి
కొద్ది సెకన్ల వీడియోల కోసం గంటల సమయం కేటాయించే యువత... ఒక మంచి పుస్తకం చదవడానికి మాత్రం సమయం లేదనడం ఆలోచించాల్సిన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్న యువత ఉంది. కానీ సరైన శిక్షణ, మార్గదర్శకత్వం, ఇంటర్నెట్ సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు లేక వారి ప్రతిభ స్థానికంగానే ఆగిపోతోంది. ప్రతి మండల కేంద్రంలో యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, కెరీర్ గైడెన్స్ కేంద్రాలు, పోటీ పరీక్షల ఉచిత స్టడీ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉంటే ఎంతోమంది యువత జీవితాలు మారవచ్చు.
యువతకు కేవలం ఉద్యోగం ఇవ్వడం మాత్రమే పరిష్కారం కాదు. ఉద్యోగం సృష్టించే స్థాయికి వారిని తీసుకెళ్లాలి. చిన్న పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, సాంకేతిక రంగాలు, నైపుణ్య ఆధారిత వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి. అదే సమయంలో యువత కూడా తమ బాధ్యతను గుర్తించాలి.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం కాకూడదు
ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే జీవితానికి లక్ష్యం కాకూడదు. యువత ఏదో ఒక రంగంలో నైపుణ్యం నేర్చుకోవాలి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. దేశాన్ని మార్చేది కేవలం నాయకులు కాదు. ఒక మంచి ఆలోచన చేసే విద్యార్థి, ఒక కొత్త ఆవిష్కరణ చేసే యువ శాస్త్రవేత్త, ఒక ఉద్యోగాన్ని సృష్టించే యువ పారిశ్రామికవేత్త, వ్యవసాయాన్ని ఆదర్శంగా మార్చే యువ రైతు, వీళ్లందరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. . యువత భవిష్యత్తు కాదు... యువతే వర్తమానం. వాళ్ల చేతుల్లోనే రేపటి దేశం రూపుదిద్దుకుంటుంది.
- తాళ్లపెళ్లి సురేందర్, జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
