వాషింగ్టన్: టర్కీ పర్యటనలో ఇరాన్ తన హత్యకు కుట్ర పన్నిందన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతోనే టర్కీ పర్యటన ముగిశాక సీక్రెట్ సర్వీస్ ఆదేశాల మేరకు తాను రహస్యంగా విమానం మారినట్లు తెలిపారు. అయితే, తాను ఇరాన్ బెదిరింపులకు భయపడ లేదని.. కేవలం సీక్రెట్ సర్వీస్ అధికారుల సూచనల ప్రకారం నడుచుకున్నానని వివరణ ఇచ్చారు. తనకు శత్రువుల ముప్పు ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని పేర్కొన్నారు. టర్కీలో ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని ది వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం తర్వాత ట్రంప్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
2026, జూలై 7, 8 తేదీలలో టర్కీ రాజధాని అంకారా వేదికగా నాటో కూటమి సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ క్రమంలో తమ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా టర్కీలో ట్రంప్‌ను అంతమొందించాలని ఇరాన్ కుట్ర చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో ట్రంప్ రిటర్న్ జర్నీ ప్రణాళికలను అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ పూర్తిగా మార్చేసింది.
సాధారణంగా ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో టర్నీ నుంచి తిరిగి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ నుంచి అధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా.. రిటర్న్ జర్నీ కోసం కెమెరాల ముందు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కారు. కానీ లోపలికి ఎంటరైన ట్రంప్‌ను ఆయన భద్రతాధికారులు రహస్య మార్గంలో నుంచి ఫుడ్ ట్రక్ (క్యాటరింగ్ వ్యాన్) లోకి చేర్చారు.
ట్రంప్‌ను ఆ ట్రక్కులో దాచి సీక్రెట్‌గా అమెరికా మిలటరీ విమానం 'ఎయిర్ ఫోర్స్ సీ32ఏ' లోకి ఎక్కించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. ట్రంప్ ఆ విమానంలోనే ఉన్నారని శత్రువులను నమ్మించేందుకు, ఆయన భద్రత దృష్ట్యా ఈ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ చాలా పకడ్బందీగా, అత్యంత గోప్యంగా సాగింది. చివరి వరకు వైట్ హౌస్ సిబ్బందికి కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.
