విద్యార్థి ఉద్యమానికి దిక్సూచి ఏఐఎస్ఎఫ్..

విద్యార్థి ఉద్యమానికి దిక్సూచి ఏఐఎస్ఎఫ్..

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో విద్యార్థులను కూడగట్టేందుకు ఆవిర్భవించిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్).. స్వతంత్ర భారతావనిలోనూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వీరోచిత పోరాటాలు నిర్వహిస్తోంది. 1936 ఆగస్టు 12న ఆవిర్భవించిన ఈ సంఘానికి దశాబ్దాల ఉద్యమ చరిత్ర ఉంది.  

స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వివిధ ప్రాంతాల్లో విడివిడిగా పోరాడుతున్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో ఐక్యం చేసిన తొలి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమే.  ఈ తొమ్మిది దశాబ్దాల ప్రస్థానం కేవలం ఒక సంస్థ చరిత్ర మాత్రమే కాదు.  స్వాతంత్ర్యం, సామాజిక, ఆర్థిక సమానత్వం, విద్యార్థుల హక్కుల కోసం సాగిన పోరాటాల చరిత్ర కలిగి ఉంది. 

దేశ స్వాతంత్య్రం కోసం...

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించిందే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని.  దేశ స్వాతంత్ర్యం కోసం జాతీయ స్థాయిలో విద్యార్థి సంఘం అవసరాన్ని గుర్తించిన ఉత్తరప్రదేశ్ విద్యార్థి నాయకులు ప్రేమ్ నారాయణ్ భార్గవ్, బాబురుద్దీన్ తదితరులు  దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో 1936 జులై 30న ఆహ్వాన సంఘం సమావేశమై ఆగస్టు 12, 13 తేదీలలో మహాసభ  నిర్వహించాలని నిర్ణయించింది. 

1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని  గంగా ప్రసాద్ మెమోరియల్ హాల్‌‌లో జరిగిన ఏఐఎస్ఎఫ్ తొలి జాతీయ విద్యార్థి మహాసభకు 11 రాష్ట్రాల నుంచి 200 శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ 96 మంది ప్రతినిధులు హాజరయ్యారు.  మహాసభలో నాటి జాతీయ  కాంగ్రెస్ నేత జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభోపన్యాసం చేశారు. 

మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపి,  సందేశాలు పంపడం ఆ మహాసభ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.  1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం హైదరాబాద్‌‌లో  జాతీయ జెండా ఎగరవేయడాన్ని నిజాం పాలకులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ  కేశవ్ మెమోరియల్ హైస్కూల్‌‌లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం చారిత్రక ఘట్టంగా నిలిచింది.

తెలంగాణలో ఏఐఎస్ఎఫ్ పోరాట చరిత్ర

తెలంగాణలో  ఏఐఎస్ఎఫ్ చరిత్ర  రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచే ప్రారంభమైంది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపిన తొలి జాతీయ విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ గుర్తింపు పొందింది. 

రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణలో  విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని,  ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఏఐఎస్ఎఫ్ అనేక ఉద్యమాలు నిర్వహిస్తోంది. 

- కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.