ఉపాధి పనులకు జియో ట్యాగ్ కష్టాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 2.33 లక్షల పనుల ట్యాగింగ్

ఉపాధి పనులకు జియో ట్యాగ్ కష్టాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 2.33 లక్షల పనుల ట్యాగింగ్
  • పనులు పూర్తయినా ఫొటోలు అప్‌‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం
  • మూడు దశల్లో పనుల జియో ట్యాగింగ్ పూర్తయితేనే కేంద్రం నుంచి నిధులు
  • సూర్యాపేట, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో తీవ్ర జాప్యం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ జీ రామ్​ జీ) పనులకు జియో ట్యాగింగ్ చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,33,321 పనుల జియో ట్యాగింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో.. కేంద్రం నుంచి వచ్చే నిధులకు బ్రేక్​పడింది. ఉపాధి హామీ స్కీమ్​లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్రో శాటిలైట్ ఆధారిత జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.

పనులు మొదలైనప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత ఫొటోలు తీసి యాప్‌‌లో అప్‌‌లోడ్ చేయాల్సిన బాధ్యతను ఆఫీసర్లకు అప్పగించారు. కానీ వారు నిర్లక్ష్యం చేస్తుండడంతో జియో ట్యాగింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 5.86 లక్షల పనులు అసంపూర్తిగా ఉండగా.. మరోవైపు వేగంగా జరుగుతున్న, ఇప్పటికే పూర్తైన పనులను సైతం యాప్‌‌లో ట్యాగ్ చేయకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన మెటీరియల్ కాంపోనెంట్, కూలీల వేతన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.

పని పూర్తయినా ఫొటోలు తీయట్లే..
రాష్ట్రంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ఉపాధి పనులకు శాపంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 2,33,321 పనుల్లో పని ప్రారంభానికి ముందు ట్యాగ్ చేయాల్సినవి 2,500 పనులు పెండింగ్ లో ఉన్నాయి. పని మొదలుపెట్టే ముందు లొకేషన్ ట్యాగ్ చేయడంలో జాప్యం లేనప్పటికీ.. పని జరుగుతున్నప్పుడు ఫొటో తీసి అప్‌‌లోడ్ చేయాల్సినవి 1.21 లక్షలకు పైగా ఉన్నాయి. పని ముగిసిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్టు ఇచ్చి జియో ట్యాగ్ చేయాల్సిన పనులే లక్షకుపైగా పేరుకుపోయాయి.

పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం వల్లే పనులు పెండింగ్‌‌లో పడిపోతున్నాయి. అయితే, ఉపాధిలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు జియో ఎంజీఎన్ఆర్ఈజీఏను తీసుకురాగా.. మూడు దశల్లో పనులు ఫొటోలు తీయాలి. పనుల లొకేషన్ వివరాలు శాటిలైట్ రికార్డులతో సరిపోలితేనే కేంద్రం డీబీటీ -స్పర్శ్ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో నిధులు చెల్లిస్తుంది. పనులు ట్యాగింగ్ పూర్తికాకపోతే ఆ పనికి పైసా కూడా రాదు.

కొన్ని జిల్లాల్లో తీవ్ర జాప్యం
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో జియో ట్యాగింగ్​లో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 16,072 పనులు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఆదిలాబాద్ లో 15,487, వికారాబాద్ లో 15,055 , ఖమ్మంలో 15,019 పనులతో పాటు సిద్దిపేట, ఆసిఫాబాద్‌‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పనులకు జియో ట్యాగింగ్​పెండింగ్ లో ఉంది. కాగా, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

అయితే, చేసిన పనులకు సంబంధించి ఫొటోలు తీసి అప్‌‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కేంద్రం నుంచి గ్రాంట్లలో కోత పడుతుందని, ఫలితంగా ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో టీఏలు, ఏపీవోలు, ఈసీలు సమన్వయంతో పనిచేసేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, వెంటనే జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 2.33 లక్షల పనుల జియో ట్యాగింగ్‌‌ను పూర్తి చేయాలని కోరుతున్నారు.