- 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో ఇండియాకు సిల్వర్
- గుల్వీర్‌కు రజతం, మన్‌ప్రీత్‌కు కాంస్యం
- దియా-మనుష్ జోడీ బ్రాంజ్‌తో సరి
- కబడ్డీ, స్క్వాష్‌లో ఐదు పతకాలు ఖాయం
నగోయా: వ్యక్తిగత విభాగాల్లో ఫెయిలైన ఇండియా షూటర్లు ఎట్టకేలకు ఆసియా క్రీడల్లో పతకాల వేటను మొదలుపెట్టారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్–సురుచి స్వర్ణ కాంతులు పూయించగా, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో ఇండియాకు సిల్వర్ మెడల్ లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఫైనల్లో కమల్‌జీత్–సురుచి 484.6 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
స్టార్టింగ్ నుంచే అద్భుతమైన గురితో ఆకట్టుకున్న ఇండియన్ షూటర్లు బరిలో ఉన్న నలుగురు జోడీలపై పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టారు. సురుచి 10.4, కమల్‌జీత్ 9.7 పాయింట్లతో పోటీని ప్రారంభించగా, రెండో ప్రయత్నంలో సురుచి 10.2, కమల్‌జీత్ 9.8 పాయింట్లు గెలిచారు. దాంతో తొలి 10 షాట్లు పూర్తయ్యేసరికి ఇండియా ద్వయం 202.4 పాయింట్లతో టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చారు.
తర్వాతి రౌండ్లలోనూ జోరు చూపెట్టిన ఈ ఇద్దరు 101.3 పాయింట్ల ఆధిక్యంతో ముందుకు సాగి పతకాన్ని సాధించారు. క్వాలిఫికేషన్స్‌లో కమల్‌జీత్–సురుచి 587 పాయింట్లు నెగ్గారు. ఇందులో 29 ఇన్నర్ టెన్స్ ఉండటం విశేషం. సౌత్ కొరియాకు చెందిన సుహ్యోన్ హాంగ్–గాయున్ చూ (478.0)కు రజతం లభించగా, ఇరాన్ (415.8) కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
సిల్వర్ త్రయం
మెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో ఇండియా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్–రుద్రాంక్ష్ పాటిల్–నీరజ్ కుమార్ త్రయం 1762 పాయింట్లు సాధించి రెండో ప్లేస్‌లో నిలిచింది. చైనా (1766), కొరియా (1751) వరుసగా గోల్డ్, బ్రాంజ్‌ను గెలిచారు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (589), నీరజ్ (588) వరుసగా మూడు, నాలుగో స్థానాలతో త్రీ పొజిషన్ ఈవెంట్ వ్యక్తిగత ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించారు.
ఒక దేశం నుంచి ఇద్దరు షూటర్లు మాత్రమే వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత సాధించే నిబంధన ఉండటంతో రుద్రాంక్ష్ క్వాలిఫై కాలేదు. అయితే ఈ ఫైనల్ ఇండియా షూటర్లకు పెద్దగా అనుకూలించలేదు. 'నీలింగ్' (మోకాళ్లపై కూర్చుని కాల్చే) దశ తర్వాత ఐశ్వరీ102.9 పాయింట్లతో మూడవ స్థానంలో నిలవగా, 10 షాట్ల తర్వాత నీరజ్ 97.1 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
'ప్రోన్' (పడుకుని కాల్చే) దశలో ఐశ్వరీ 102.4 పాయింట్లు సాధించి తన మొత్తం స్కోరును 205.3కి పెంచుకుని ఆరో స్థానానికి చేరుకోగా, నీరజ్ 103.8 పాయింట్లు సాధించి తన మొత్తం స్కోరును 200.9కి పెంచుకున్నప్పటికీ చివరి స్థానంలోనే ఉండిపోయాడు. 25 షాట్ల తర్వాత ఐశ్వరీ 256.5 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకాడు. కానీ నీరజ్ ఎనిమిదో ప్లేస్‌లోనే కొనసాగాడు.
