మహారాష్ట్ర రాష్ట్రాన్ని కరువు పీడిస్తోంది. మహారాష్ట్రలోని 358 తాలూకాల్లో.. 265 తాలూకాలు కరువు ప్రభావిత ప్రాంతాలు గుర్తిస్తూ.. సీఎం ఫడ్నవిస్ స్వయంగా ప్రకటించారు. అంటే 75 శాతం ప్రాంతాల్లో కరువు ఉందని.. వ్యవసాయం లేదని స్పష్టం చేసిన సీఎం ఫడ్నవీస్.. రైతులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని వివరించారాయన.
2026, జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 శాతం వరకు లోటు వర్షపాతం ఉందని.. మరాథ్వాడ, పూణె, నాసిక్ ప్రాంతాల్లో ఇది మరింత లోటుగా ఉందని డేటా స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో మంచి నీటి కొరత ఏర్పడుతుందని మహారాష్ట్ర సర్కార్ ముందుస్తుగా హెచ్చరించింది.
ధరాశివ్, బీడ్ జిల్లాల్లో జూలై నుంచి వర్షాలు పడలేదని.. ఈ క్రమంలోనే రైతులు పంటల సాగు చేపట్టలేదు. రైతులు, రైతు కూలీలకు రోజువారీ జీవినమే దెబ్బతిన్నట్లు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది.
ఇక ఛత్రపతి సంభాజీనగర్ డివిజన్ లో 30 శాతం లోటు వర్షం నమోదైంది.
ఫూణె, నాసిక్ డివిజన్లలో 30 శాతం, నాగపూర్ డివిజన్ లో 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
అమరావతి, సోలాపూర్, లాతూర్ సహా ఆరు జిల్లాల్లో ఏకంగా 50 శాతం లోటువర్షం పడటంతో.. ఆ ఆరు జిల్లాల్లో కరువు భీకరంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది.
ALSO READ : వివాదంలో సీఈసీ జ్ణానేష్ కుమార్తె..
మహారాష్ట్రలో ఖరీఫ్ సీజన్ లో సోయాబీన్, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు వంటి పంటలను పండిస్తారు.. వర్షాలు లేకపోవటంతో ఈసారి సాగు విస్తీర్ణం 50 శాతం దాటలేదని.. సాగు చేసిన పంటలకు తెగుళ్ల బెడద తీవ్రంగా ఉండటంతో రైతులు దారుణంగా నష్టపోయినట్లు ఈ రిపోర్ట్ వెల్లడిస్తోంది.
ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగుతున్నారు. పంట నష్టం, కరువు సాయం ప్రకటించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం.. కరువు తీవ్రంగా ఉండి.. పంటలు సాగుచేయని ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలకు నగదు సాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు అక్కడి జనం.
