షాట్‌పుట్‌లో రజతం సాధించిన తేజిందర్‌పాల్ సింగ్: గుల్వీర్-యూనస్ 1500m ఫైనల్‌కు!

షాట్‌పుట్‌లో రజతం సాధించిన తేజిందర్‌పాల్ సింగ్: గుల్వీర్-యూనస్ 1500m ఫైనల్‌కు!

Asian Games 2026: ఆసియా క్రీడలలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనలతో పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారత్ మరోసారి తన సత్తా చాటింది. షాట్‌పుట్ విభాగంలో తేజిందర్‌పాల్ సింగ్ తూర్ రజత పతకం సాధించగా, స్ప్రింటర్ అనిమేష్ కుజుర్ 200 మీటర్ల ఫైనల్‌కు దూసుకెళ్లారు. అలాగే మిడిల్ డిస్టెన్స్ రన్నర్లు కూడా పతకం రేసులోకి దూసుకెళ్లారు. 

షాట్‌పుట్‌లో తేజిందర్‌పాల్ సింగ్ రజతం: 

పురుషుల షాట్‌పుట్ ఫైనల్‌లో భారత స్టార్ అథ్లెట్ తేజిందర్‌పాల్ సింగ్ తూర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. తన ఐదో ప్రయత్నంలో 20.64 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇరాన్‌కు చెందిన మొహమ్మద్‌రెజా తయేబిసే 20.81 మీటర్ల గేమ్స్ రికార్డు త్రోతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. గతంలో 2018 జకార్తా, 2022 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లో వరుసగా స్వర్ణాలు గెలిచిన తూర్.. తాజాగా ఐచి-నగోయా గేమ్స్‌లో రజతం సాధించి ఆసియా వేదికపై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. 

1500 మీటర్లలో గుల్వీర్, యూనూస్ దూకుడు: 

పురుషుల 200 మీటర్ల సెమీఫైనల్-3లో భారత స్ప్రింటర్ అనిమేష్ కుజుర్ 20.81 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలవడంతో, ఫైనల్‌కు అర్హత సాధించారు. థాయ్‌లాండ్‌కు చెందిన పురిపోల్ బూన్సన్ 20.10 సెకన్లతో గేమ్స్ రికార్డు సృష్టించారు. అంతకుముందు 100 మీటర్ల ఫైనల్ రేసును కోల్పోయిన అనిమేష్, 200 మీటర్లలో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి పతక రేసులో నిలిచారు.

* ఇక పురుషుల 1500 మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు మరో శుభవార్త అందగా.. హీట్-2లో గుల్వీర్ సింగ్ (3:45.79), హీట్-1లో యూనూస్ షా (3:45.77) తమ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఎల్లుండి (సోమవారం, సెప్టెంబర్ 28) ఈ పతక పోరు జరగనుంది.

►ALSO READ | తిరువనంతపురంలో రోహిత్ ఫ్యాన్స్ రచ్చ.. గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 50 అడుగుల కటౌట్!

కబడ్డీలోనూ గోల్డ్ మెడల్: 

ఇదిలా ఉండగా, ఈరోజు (సెప్టెంబర్ 26, శనివారం) జరిగిన పురుషుల కబడ్డీ ఫైనల్‌లో ఇరాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ అద్భుతమైన కంబ్యాక్‌తో 39–34 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి అర్ధభాగంలో 17–18తో వెనుకబడినప్పటికీ, ఆ తర్వాత చెలరేగిపోయి భారత్ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.