ఖగోళశాస్త్రవేత్తలు.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం రేపు ( ఆగస్టు 12) ఈ ఏడాది ( 2026) రెండో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడిని రాహువు మింగేస్తాడు. ఈ సమయంలో సూర్య గ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. రేపు ( ఆగస్టు 12) ఏ సమయంలో ఏర్పడుతుంది.. ఏఏ దేశాల్లో ఏర్పడుతుంది.. ఏఏ నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
ఈ ఏడాది (2026) ఆగస్టు 12 వ తేదీ బుధవారం చివరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. భారత కాలామానం ప్రకారం ఆగస్టు 12వ తేదీ బుధవారం రాత్రి సుమారు 9:04 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11:17 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుని గ్రహణం యొక్క చివరిదశ ఆగస్టు 13న తెల్లవారుజామున 1:29 గంటలకు ముగుస్తుంది.
ఈ ఏడాది ( 2026) రెండో అతిపెద్ద సూర్య గ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక్ కాలం చెల్లుబాటు కాదు. ఉత్తర రష్యా, గ్రీన్ లాండ్, ఐస్ లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ సూర్య గ్రహణంగా కనిపిస్తుంది. గ్రహణం సమయంలో ఉత్తర స్పెయిన్‌లో పగటిపూట కొంత చీకటి అలముకోవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉత్తర ప్రాంతాలు కెనడా, వాయువ్య ఆఫ్రికా, ఐరోపాలోని అనేక ప్రాంతాలలో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది.
గ్ర హణం సమయంలో చేయాల్సిన పనులు
- శాస్త్రాల ప్రకారం పవిత్రమైన నదీ తీర ప్రాంతాల్లో జపం చేసుకుంటే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
- గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి, పేదలకు దానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు
- గ్రహణానికి ముందు మీరు తినే పదార్థాలలో, నీళ్లలో గరికను ఉంచాలి.
- గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకూడదు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి.
- సూర్యగ్రహణం సమయంలో సూర్య మంత్రాలను జపించాలి.
- గ్రహణానికి ఆరు గంటల ముందు పనులన్నీ పూర్తి చేసుకోవాలి.
పొరపాటున కూడా చేయకూడని పనులు
- సూర్య గ్రహణం వేళ గర్భిణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతారు.
- గ్రహణం సమయంలో గర్భిణులు నిద్ర పోతుంటే, అటు ఇటు కదలకూడదు.
- గర్భంలో ( పిండంలో) ఉండే బేబీకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
- గ్రహణం సమయంలో కుర్చీలో లేదా సోఫాలో ప్రశాంతం కూర్చొని పుస్తకం చదవడం లేదా ఏదైనా తేలికైన పనులు చేయాలి.
- గర్భిణులు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. మూడేళ్ల చిన్నారులకు నదీ స్నానాలు చేయించరాదు.
- గ్రహణం సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు.
- గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
- గ్రహణం పూర్తయిన తర్వాతే స్నానం చేయాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం
