ఈ ఏడాది ( 2026) ఆగస్టు 12 బుధవారం రెండో అతి పెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహణం కర్కాటకరాశి.. ఆశ్లేష నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ప్రభావం 3 నుంచి ఆరు నెలల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీని వలన నాలుగు( వృషభ,కన్య,తుల, కుంభ) రాశులవారికి గోల్డెన్ డేస్ రావడం... అనుకున్న పనులు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. సూర్యగ్రహణం ప్రభావం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!
ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడనున్న సూర్యగ్రహణానికి జ్యోతిష్య పరంగా చాలా ప్రాధాన్యత కలిగుంది. ఈ సూర్యగ్రహణంప్రపంచంలో 55 దేశాల్లో కనిపిస్తుంది . మన దేశంలో మాత్రం కనిపించదు. అందువల్ల మన దేశంలో ఈ గ్రహణ సమయంలో సూతకం నియమాలు వర్తించవని పండితులు చెప్తున్నారు. అయినప్పటికీ ఖగోళంగా జరిగే ఎటువంటి పరిణామాలైనా వాటి ప్రభావం మాత్రం 12 రాశులపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. అయితే వీటిలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగనుండగా మరి కొన్ని రాశులకు మిశ్రమంగా, అదే విధంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నాయి.
మేష రాశి: ఈ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం ప్రతికూలంగా మారే సూచనలున్నాయి. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆస్తి కొనుగోళ్లు వంటి పెద్ద నిర్ణయాలను ఆచి తూచి తీసుకోవాలి. సంతకాలు పెట్టేప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు, భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో ఎవరిని ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దని పండితులు చెబుతున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభరాశి : ఈ రాశి వారికి సూర్య గ్రహణం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అయితే కష్టించి పని చేయాలని పండితులు సూచిస్తున్నారు. కొత్తగా వ్యాపారాలకు సంబందించి .. కొత్త బ్రాంచిలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.కొత్తగా చేపట్టిన ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు.దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు.
మిథునరాశి : సూర్య గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారికి అసహనం పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. ఉద్యోగులకు ఆఫీసులో ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. మాట పట్టింపు వ్యహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అస్సులు పెట్టవద్దు. కుటుంబ సభ్యులతో లేనిపోని విషయాలకు వాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల విషయంలో అనవసరంగా తలదూర్చవద్దు. మధ్యవర్తిత్వాలు, హామీ సంతకాలకు చాలా దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటకరాశి : ఇదే రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశివారిపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. సూర్యగ్రహణం తరువాత ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. అదే విధంగా వీరిలో మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం, పెద్దల, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి : ఈ రాశి వారికి సూర్య గ్రహణ ప్రభావం ప్రతికూల పరిస్థితులను కలుగజేసూ సూచనలు ఉన్నాయి. ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు .. వాహనా రిపేర్లు ఇలా అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తివివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ప్రతి విషయంలో కూడా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో అవమానాలు కలుగుతాయి. ఆఫీసులో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వీలైనంతవరకు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లోనూ కొద్దిగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. అందుకే ఈ రాశి వారు రానున్న 4 నెలల పాటు ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.
కన్య రాశి : ఈ రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావం చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఆదాయం పెంచుకునే మార్గాలు కనిపిస్తాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వారి వల్ల మీరు లాభాపడతారు. అయితే వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త వహించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి : ఈ రాశి వారికి గ్రహణ ప్రభావంతో ఒక్కసారిగా ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థికంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి, నూతన ఉద్యోగానికి ప్రయత్నించే వారికి విదేశీ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు, వృత్తి నిపుణులకు కూడా కొత్త అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉంది. సరైన సమయంలో సుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చికరాశి : సూర్యగ్రహణం ప్రభావం వలన ఈ రాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన విషయంలో మార్పులు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాలు.. ఆరోగ్య పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగం.. ఆరోగ్యం...వృత్తి.. వ్యాపార పరంగా ఒడుదొడుకులను ఎదుర్కొంటారు.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి : ఈ రాశిపై గ్రహణ ప్రభావం అధికంగానే ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హామీలేకుండా ఎవరికీ ధనాన్ని అప్పుగా ఇవ్వవద్దు. తొందరపాటు పెట్టుబడుల వలన నష్టాలు కలిగే అవకాశం ఉంది. వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహసోపేతమైన ఎటువంటి నిర్ణయాలను రెండు నెలల పాటు వాయిదా వేయండం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
మకరరాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ప్రభావం వలన మకర రాశి వారిపై సానుకూలంగా ఉంటుంది . కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు, లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఆర్థిక లావాదేవీలు .. కొత్త ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తిపరంగా మంచి లాభాలు, అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి : ఈ రాశివారికి గ్రహణ ప్రభావం వలన ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. పాత పెట్టుబడుల లాభాలు ఇప్పుడు అందుకుంటారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి: ఈ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావాలు గ్రహణం ఏర్పడ్డ తొలి రెండు నెలల్లో అధికంగా ఉంటాయి. ఆ తరువాత మెల్లగా తగ్గుతాయి. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిత్యం దైవారాధన చేసుకుంటూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి, ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల గ్రహణ ప్రభావాలు తగ్గి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం
