ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. 4 రీఛార్జ్ ప్లాన్స్ ఎత్తేసిన కంపెనీ.. ఇక స్టార్టింగ్ ప్లాన్ రూ.349!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. 4 రీఛార్జ్ ప్లాన్స్ ఎత్తేసిన కంపెనీ.. ఇక స్టార్టింగ్ ప్లాన్ రూ.349!

మొబైల్ రీచార్జ్ చేసుకునే ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా 4 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రూ.299, రూ.579, రూ.619, రూ.649 ప్లాన్‌లు ఇక అందుబాటులో ఉండవు. ముఖ్యంగా చాలామంది వినియోగించే రూ.299 ప్లాన్ స్థానంలో రూ.349 ప్లాన్‌ను తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఎంట్రీ లెవల్‌లో ఉన్న పాపులర్ రీచార్జ్ ప్లాన్ ధర ఏకంగా 16 శాతం పెరిగిందన్నమాట.

రూ.299 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో వచ్చిన రూ.349 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే అదనంగా 500MB రోజువారీ డేటా వస్తున్నప్పటి.. కస్టమర్ రూ.50 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.249, రూ.299 మధ్యస్థాయి ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ తొలగించింది. ప్రస్తుతం రూ.199 ప్లాన్ 28 రోజులకు 2GB డేటాతో కొనసాగుతుండగా.. తర్వాతి ఆప్షన్‌గా రూ.219 ప్లాన్ ఉంది. ఇందులో 28 రోజులకు 3GB డేటా లభిస్తుంది.

అయితే ఈ మార్పుల వెనుక కేవలం ధర పెంపు మాత్రమే లేదని తెలుస్తోంది. ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ టారిఫ్ నిర్మాణాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. కంపెనీ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ ఇటీవల చెప్పినట్లుగా.. చాలా తక్కువ ధరలకు అన్‌లిమిటెడ్ డేటా అందించడం వల్ల టెలికాం కంపెనీల ARPU.. అంటే ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం పరిమితమవుతోందట. అందుకే ఎక్కువ డేటా వాడే కస్టమర్లు అందుకు తగ్గట్టుగా ఎక్కువ చెల్లించే విధంగా కొత్త ప్రైసింగ్ ఆర్కిటెక్చర్ రూపొందించాలనే ఆలోచనలో ఎయిర్‌టెల్ ఉంది.

భారతదేశంలో డేటా వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. కస్టమర్లు చిన్న డేటా ప్లాన్‌ల నుంచి పెద్ద ప్యాక్‌లకు మారుతున్నారని టెలికాం రంగం భావిస్తోంది. ఈ మార్పును ఉపయోగించుకుని రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో ARPUను స్థిరంగా పెంచుకోవచ్చని ఎయిర్‌టెల్ అభిప్రాయపడుతోంది. అయితే మరోవైపు 5G నెట్‌వర్క్‌లపై భారీ పెట్టుబడులు, నిర్వహణ ఖర్చుల కారణంగా టెలికాం కంపెనీలకు ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా మారింది కంపెనీలకు. ఈ ఏడాది టెలికాం రంగంలో మరో 10-15 శాతం టారిఫ్ పెంపు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ALSO READ : సెప్టెంబరులో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఊచకోతకు ఒరాకిల్ సిద్ధం!

అందుకే ఎయిర్‌టెల్ తాజా నిర్ణయం కస్టమర్లకు భవిష్యత్తులో రీచార్జ్ ఖర్చులు పెరగబోతున్నాయనే సంకేతంగా నిలవనుంది. ప్రస్తుతం కంపెనీ అన్ని ప్లాన్‌ల ధరలను ఒకేసారి పెంచకుండా.. కొన్ని ప్యాక్‌లను తొలగించింది. ఇదే విధానాన్ని ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ‘తక్కువ ధరలో ఎక్కువ డేటా’ కోసం పోటీ పడిన టెలికాం కంపెనీలు.. ఇకపై ‘ఎక్కువ డేటా కావాలంటే ఎక్కువ చెల్లించాలి’ అనే కొత్త విధానంలోకి అడుగుపెడుతున్నాయి. అంటే రానున్న రోజుల్లో జియో, వొడఫోన్ ఐడియాలు కూడా ఇదే దారిని ఫాలో అవ్వొచ్చు.