ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన ఒరాకిల్‌లో మరోసారి తెరపైకి లేఆఫ్స్ చర్చ వచ్చింది. 2026 మార్చి చివర్లో ప్రపంచవ్యాప్తంగా 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంస్థ.. ఇప్పుడు మరో రౌండ్ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే 2వ త్రైమాసికానికి ముందు ఎఫెక్టెడ్ ఉద్యోగులకు సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సారి ఎంత మందికి కంపెనీ ఇళ్లకు పంపనుందనే అంశంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
ఒరాకిల్ లోని మేనేజర్లను మరోసారి తొలగింపులకు గురయ్యే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కొన్ని టీమ్స్‌లో ఉద్యోగుల సంఖ్యను రెండంకెల శాతంలో తగ్గించే అవకాశం ఉందని సమాచారం. మార్చిలో చేపట్టిన తొలగింపులతో సంస్థ తన ఉద్యోగుల సంఖ్యలో సుమారు 13 శాతం తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా 41వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈసారి లేఆఫ్స్ చేపడితే ఈ సంఖ్య భారీగానే తగ్గనుందని తెలుస్తోంది.
ఒరాకిల్ లేఆఫ్స్ వెనుక ప్రధాన కారణంగా ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెరుగుతున్న ఖర్చులు కనిపిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 55 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో AI మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన వ్యయాలు కీలకంగా ఉన్నాయి. ఇదే సమయంలో సంస్థ సుమారు 43 బిలియన్ డాలర్లను డెట్, ఈక్విటీ మార్గాల్లో సమీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగుల తొలగింపులను సంస్థ ఒక మార్గంగా చూడటం టెక్కీలకు నిద్రలేకుండా చేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా.
ఇదే సమయంలో ఒరాకిల్ పునర్వ్యవస్థీకరణపై కూడా భారీగా ఖర్చు చేస్తోంది. కంపెనీ ఇటీవల సమర్పించిన ఫైలింగ్ ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు, సెవెరెన్స్, ఇతర రీస్ట్రక్చరింగ్ ఖర్చుల కోసం రూ.17వేల 500 కోట్లకు పైగానే వెచ్చించింది. AIపై భారీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి, మరోవైపు ఖర్చులను తగ్గించాల్సిన అవసరం..ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నం చేస్తోంది టెక్ దిగ్గజం. అయితే తాజా లేఆఫ్స్‌పై ప్రస్తుతానికి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
