లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే గ్యారంటర్ జీతం నుంచి డబ్బు కట్ చేయొచ్చా..? కోర్టు సంచలన తీర్పు

లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే గ్యారంటర్ జీతం నుంచి డబ్బు కట్ చేయొచ్చా..? కోర్టు సంచలన తీర్పు

లోన్ తీసుకున్న వ్యక్తి రుణం చెల్లించకపోతే.. ఇక గ్యారంటర్‌పై నేరుగా రికవరీ చర్యలు తీసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందుగా లోన్ తీసుకున్న వ్యక్తి నుంచి మొత్తం బకాయిలను వసూలు చేయాలని బ్యాంకు ప్రయత్నించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లోన్ తీసుకున్న వ్యక్తికి, గ్యారెంటీగా ఉన్న వ్యక్తికి బాధ్యతలు సమానంగా ఉంటాయని కోర్టు పేర్కొంది. అందువల్ల పరిస్థితిని బట్టి బ్యాంకు వాస్తవంగా లోన్ తీసుకున్న వ్యక్తి నుంచి, గ్యారంటర్ నుంచి లేదా ఇద్దరి నుంచీ ఒకేసారి బకాయిలను రికవర్ చేసుకోవచ్చని తెలియజేసింది.

లక్నో బెంచ్‌కు చెందిన జస్టిస్ శేఖర్ బి. సరాఫ్, జస్టిస్ అబ్ధేష్ కుమార్ చౌధరి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. యూపీ పోస్టల్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో లోన్స్ తీసుకున్న విక్రాంత్ దూబేకు.. వీనీత్ పాండే, అనూప్ కుమార్ మిశ్రా గ్యారంటర్లుగా ఉన్నారు. దూబే 2022-23లో రూ.50 వేల ఫెస్టివల్ లోన్, రూ.3 లక్షల షార్ట్ టర్మ్ లోన్, రూ.18 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు. అయితే రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు రికవరీ చర్యలు ప్రారంభించింది.

ఈ క్రమంలో గ్యారంటర్లుగా ఉన్న ఇద్దరి జీతాల నుంచి నెలకు రూ.10 వేల చొప్పున కోత విధించాలని బ్యాంకు పోస్టల్ శాఖను కోరింది. దీనిని గ్యారంటర్లు కోర్టులో సవాల్ చేశారు. ముందుగా అసలు లోన్ తీసుకున్న వ్యక్తి(విక్రాంత్ దూబే) నుంచి డబ్బు వసూలు చేయాలని, అతని నుంచి రికవరీ సాధ్యం కానప్పుడు మాత్రమే తమను సంప్రదించాలని వారు వాదించారు. లోన్ తీసుకున్న వ్యక్తి అలాగే గ్యారంటర్ల నుంచి ఒకేసారి డబ్బు వసూలు చేయడం చట్టబద్ధం కాదని వారు పేర్కొన్నారు.

అయితే గ్యారంటర్ల వాదనలు విన్న కోర్టు వాటిని తిరస్కరించింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1872లోని సెక్షన్ 128 ప్రకారం గ్యారంటర్ బాధ్యత సాధారణంగా ఒరిజినల్‌గా లోన్ తీసుకున్న వ్యక్తి బాధ్యతతో సమానంగా ఉంటుందని స్పష్టం చేసింది. గ్యారంటీ ఒప్పందంలో ప్రత్యేకంగా వేరే నిబంధన ఉంటే తప్ప.. బ్యాంకు ముందుగా రుణగ్రహీతపై మాత్రమే చర్య తీసుకోవాలని చట్టంలో ఎలాంటి తప్పనిసరి క్రమపద్దతి లేదని పేర్కొంది. ఈ కేసులో అలాంటి షరతు లేకపోవడంతో గ్యారంటర్ల జీతాల నుంచి లోన్ రికవరీ కోసం నెలవారీ డబ్బు కట్ చేయటం చట్టబద్ధమేనని తేల్చింది.

అయితే గ్యారంటర్ డబ్బు చెల్లించిన తర్వాత అతనికి కూడా చట్టపరమైన హక్కు ఉంటుంది. తాను బ్యాంకుకు చెల్లించిన మొత్తాన్ని అసలు రుణగ్రహీత నుంచి తిరిగి పొందేందుకు అతను చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నెలకు రూ.10 వేల జీతం కోత విధించాలన్న బ్యాంకు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. వీనీత్ పాండే, అనూప్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పుతో లోన్‌కు గ్యారంటర్‌గా సంతకం చేసే వ్యక్తులకు రుణం తీసుకున్న వ్యక్తి డిఫాల్ట్ అయితే తమపై కూడా నేరుగా రికవరీ చర్యలు ఉంటాయన్న వాస్తవాన్ని మరోసారి స్పష్టమైంది.