శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటించిన చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డా. చింతాడ హేమారావు నిర్మించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలో నిర్వహించారు.
అతిథిగా హాజరైన డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘ఈ టీమ్‌లోని ప్రతి ఒక్కరిలో నిజాయితీగా పనిచేశాం అనే ఫీల్ కనిపిస్తోంది. అందరికీ ఈ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. దర్శకుడు మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ‘చకోర’ స్వచ్ఛమైన ప్రేమ, లక్ష్య సాధన కోసం చేసే అవిశ్రాంత ప్రయత్నం నేపథ్యంలో తెరకెక్కిన అందమైన ప్రేమకథ అని చెప్పాడు.
ఈ సినిమా తమకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని హీరో హీరోయిన్ నమ్మకం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆదరణే తమకు గొప్ప ఆస్తి అని నిర్మాత డా. చింతాడ హేమారావు అన్నారు. కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొన్నారు.
