బెంగాల్లో ఆరు నెలల్లో యూసీసీ అమలు..సీఎం సువేందు అధికారి

బెంగాల్లో ఆరు నెలల్లో యూసీసీ అమలు..సీఎం సువేందు అధికారి

కోల్‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌లో ఆరు నెలల్లోగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్, గుజరాత్ బాటలోనే బెంగాల్‌‌‌‌లోనూ యూసీసీని తీసుకొస్తామని పేర్కొన్నారు. ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కఠినమైన చట్టాలను తీసుకువస్తామన్నారు.

 ఆదివారం ఓ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. యూసీసీ అమలుతో పాటు మతమార్పిడులను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలను రూపకల్పన చేస్తామన్నారు. దేశంలోకి బయటి నుంచి అక్రమంగా ప్రవేశించినవారిపై ఉక్కుపాదం మోపాలని ప్రధాని మోదీని ఆయన కోరారు.

 గత పాలకులు కులాల వారీగా, వర్గాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ప్రజలు ఎన్నో ఆశలతో జాతీయవాద ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఆ ఆశలను వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. ఇక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యంలో భాగంగా కోల్‌‌‌‌కతాలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. నవంబర్ 17న కోల్‌‌‌‌కతాలో హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.