న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ (యూఎస్ ఎఫ్‌డీఏ) నుంచి కీలక అనుమతి లభించింది. మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) చికిత్సలో వాడే 'పెరాంపనెల్' ట్యాబ్లెట్లను తయారు చేసి విక్రయించేందుకు తుది ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది.
ఈ మందును 4 ఏళ్లు పైబడిన వారిలో పార్షియల్ -ఆన్‌సెట్ మూర్ఛలు, 12 ఏళ్లు పైబడిన వారిలో టానిక్-క్లోనిక్ సీజర్ల చికిత్సలో వినియోగిస్తారు. పెరాంపనెల్ కెటలిస్ట్ ఫార్మాకు చెందిన 'ఫైకోంపా'కు బయోఈక్వివలెంట్. అరబిందో అనుబంధ సంస్థ ఏపీఎల్ హెల్త్‌కేర్ యూనిట్-4లో దీన్ని తయారు చేసి, ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్‌లో మార్కెట్లోకి తేనున్నారు.
అమెరికాలో ఈ మందు మార్కెట్ విలువ 67 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ తాజా ఆమోదంతో అరబిందో మొత్తం యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవల్స్ సంఖ్య 599కి చేరింది.
