- ఒకరు మృతి, అనేక మందికి గాయాలు
- జర్మనీ చాన్స్‌లర్ పర్యటన వేళ.. రష్యా డ్రోన్ల వర్షం
- కీవ్‌లో నదిపై ప్రధాన బ్రిడ్జి పేల్చివేత
- దాడులను ఖండించిన జెలెన్‌స్కీ
కీవ్: ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలపై రష్యా ఆదివారం డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా డ్రోన్లు సుమీ ప్రాంతంలోని భారత్‌కు చెందిన కుసుమ్ గ్రూప్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌పైనా పడటంతో మంటలు చెలరేగి ప్లాంట్ దగ్ధమైపోయింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఫార్మా ప్లాంట్ వేర్‌హౌస్ పూర్తిగా ధ్వంసమైంది.
ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. కుసుమ్ గ్రూప్ 1994లో ఉక్రెయిన్‌కు భారతీయ మందులను ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిని భారతీయ పౌరుడైన రాజీవ్ గుప్తా నిర్వహిస్తున్నారు. 2002లో ఇతర కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసి, సొంత బ్రాండ్లను మార్కెట్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత తయారీ రంగంలోకి అడుగుపెట్టి, 2007లో భారత్‌లో, 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో ప్లాంట్లను ఉత్పత్తిని మొదలుపెట్టారు.
కుసుమ్ గ్రూప్ 50కి పైగా జెనెరిక్ ఔషధాలను తయారు చేస్తూ, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్‌తో సహా 9 దేశాలకు విక్రయిస్తోంది. రష్యా, -ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ సుమీ ప్లాంట్ నిరంతరంగా పనిచేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తీవ్రంగా దెబ్బతింది. ఈ దాడి వల్ల కనీసం రూ. 400 కోట్ల నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు.
కాగా, భారతీయ ఫార్మా ప్లాంట్‌పై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ‘ఎక్స్’ వేదికగా ఖండించారు. ‘ఈ ఉదయం రష్యన్లు మరోసారి కీవ్‌లోని పివ్నిచ్నీ వంతెనపై డ్రోన్‌తో దాడి చేశారు. సుమీలోని ఒక ఫార్మాస్యూటికల్ వేర్‌హౌస్‌పై డ్రోన్లతో దాడి చేశారు. దినిప్రోలో వారు ఒక కమ్యూనికేషన్ కేంద్రాన్ని కూడా టార్గెట్ చేశారు.
ఈ దాడుల వల్ల ఆరుగురు గాయపడ్డారు’’ అని ఆయన వెల్లడించారు. కాగా, రష్యా ప్రస్తుతం వేగవంతమైన, చవకైన జెట్ పవర్డ్ షాహెద్ డ్రోన్‌లను పెద్ద ఎత్తున ప్రయోగిస్తోంది. వాటి వేగాన్ని అందుకోవడంలో ఉక్రెయిన్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌లు ఫెయిల్ అవుతుండటంతో అనేక చోట్ల భారీ నష్టం సంభవిస్తోంది.
జర్మనీ చాన్సలర్ పర్యటిస్తుండగానే..
యూరోపియన్ దేశాల మద్దతును తెలిపేందుకు జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ ఆదివారం ఉదయం కీవ్‌లో పర్యటించిన సమయంలోనే రష్యా డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఆకస్మికంగా కీవ్‌కు వచ్చిన మెర్జ్.. రష్యా దాడిలో దెబ్బతిన్న కీవ్‌లోని ఉక్రెయిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భవనాన్ని జెలెన్‌స్కీతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మెర్జ్ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ పౌరులపై జరుగుతున్న ఈ ఆటవిక దాడులు ఆగిపోవాలి. ఇవి రోజువారీ యుద్ధ నేరాలు” అని అన్నారు. ఈ అర్థం లేని యుద్ధాన్ని ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆయన కోరారు. రష్యాను అడ్డుకోకపోతే దాని భవిష్యత్తులో అది యూరప్‌కు ముప్పుగా మారుతుందని యురోపియన్ దేశాలను హెచ్చరించారు.
ఉక్రెయిన్‌కు1.3 బిలియన్ యూరోల సహాయం ప్రకటించారు. అదేసమయంలో రష్యా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడి జరిపింది. వింటర్ సీజన్ సమీపిస్తుండటంతో జనజీవనం, రవాణాను స్తంభింపచేసే లక్ష్యంతో కీవ్‌లోని కీలక వంతెనను పేల్చేసింది. రష్యా దాడులను ఖండిస్తూ, ఆ దాడులకు సంబంధించిన వీడియోలను జెలెన్‌స్కీ ‘ఎక్స్’లో షేర్ చేశారు.
