టీచర్ల కొరతపై ప్రశ్నించిన ఎమ్మెల్యేపై ఆప్ వేటు..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని బహిష్కరణ

టీచర్ల కొరతపై ప్రశ్నించిన ఎమ్మెల్యేపై ఆప్ వేటు..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని బహిష్కరణ

చండీగఢ్‌‌‌‌: పంజాబ్‌‌‌‌ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత ఉందంటూ బహిరంగంగా ప్రశ్నించిన మౌర్‌‌‌‌ నియోజకవర్గ ఆమ్‌‌‌‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌‌‌‌వీర్‌‌‌‌ సింగ్‌‌‌‌ మైసర్‌‌‌‌ఖానాను ఆప్‌‌‌‌ పార్టీ నుంచి బహిష్కరించింది. సోషల్‌‌‌‌ మీడియా లైవ్‌‌‌‌లో మాట్లాడిన ఆయన.. తన నియోజకవర్గంలోని పలు స్కూళ్లలో టీచర్‌‌‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ సమస్యను ప్రభుత్వం, సీనియర్‌‌‌‌ నేతల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. తన పిల్లలు చదివే ప్రభుత్వ స్కూల్​లోనూ సరిపడా బోధనా సిబ్బంది లేరని చెప్పారు. 

బుర్జ్‌‌‌‌ సాహిమా గ్రామంలోని స్కూల్​అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌కు అర్హత ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పార్టీలోనూ తనను పక్కన పెట్టి అవమానించారని మైసర్‌‌‌‌ఖానా ఆవేదన వ్యక్తం చేశారు. తర్న్‌‌‌‌తారన్‌‌‌‌ ఎన్నికల సమయంలో తనపై కుట్ర జరిగిందని, తనకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యుడికి పార్టీ టికెట్‌‌‌‌ ఇస్తామని చెప్పినట్లు ఆరోపించారు. ఆప్‌‌‌‌ మాత్రం తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ బహిష్కరించింది. 

అయినా ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మైసర్‌‌‌‌ఖానా వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్‌‌‌‌ నేత బిక్రమ్‌‌‌‌ సింగ్‌‌‌‌ మజీథియా స్పందించారు. విద్యా సంస్కరణలపై ఆప్‌‌‌‌ చేస్తున్న ‘శిక్షా క్రాంతి’ ప్రచారానికి, టీచర్ల కొరత ఆరోపణలకు పొంతన లేదని విమర్శించారు.