న్యూఢిల్లీ (పీటీఐ): ఏఐ సేఫ్టీ కోసం ఇండియా తన అవసరాలకు తగ్గట్టుగా ఫ్రేమ్‌వర్క్‌ను రెడీ చేసుకోవాలని, అమెరికా తరహా ఒప్పందాలను గుడ్డిగా ఫాలో అవ్వొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. దేశీయ భాషలు, వైవిధ్యం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సొంత 'ఏఐ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్'ను రూపొందించుకోవాలని తెలిపారు.
ఇటీవల వైట్‌హౌస్‌లో గూగుల్, మెటా, ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి దిగ్గజాలతో కుదిరిన ‘సెల్ఫ్ రెగ్యులేషన్’ ఒప్పందం నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది.
సెల్ఫ్ రెగ్యులేషన్ సరిపోదు..
అమెరికా విధానం కంపెనీల సెల్ఫ్ రెగ్యులేషన్‌పై ఆధారపడగా, యూరోపియన్ యూనియన్ కఠిన చట్టాలను, చైనా ప్రభుత్వ నియంత్రణను అమలు చేస్తున్నాయి. ఇండియాలో ఏఐ భద్రతలో కేవలం సెల్ఫ్ రెగ్యులేషన్ సరిపోదని, ఫార్మా, ఏవియేషన్ రంగాల
తరహాలోనే బలమైన నియంత్రణ
వ్యవస్థ, పారదర్శకత అవసరమని నాస్కామ్ ఛైర్మన్ శ్రీకాంత్ వెలమకన్ని పేర్కొన్నారు. డీప్‌ఫేక్స్, సైబర్ దాడులు, కీలక వ్యవస్థలపై దాడులను అడ్డుకోవడం అత్యంత ప్రాధాన్య అంశాలని తెలిపారు. భారత్ ప్రధానంగా ఫౌండేషనల్ మోడళ్ల కంటే అప్లికేషన్ ఆధారిత ఏఐపై దృష్టి పెడుతోందని గ్రాంట్ థార్నటన్ భారత్‌లో పార్టనర్‌గా ఉన్న అమిత్ ఖన్నా తెలిపారు.
డిఫెన్స్, హెల్త్, బ్యాంకింగ్ వంటి సున్నితమైన రంగాలకు తప్పనిసరి చట్టపరమైన నిబంధనలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ విభాగానికి సరళమైన నిబంధనలతో కూడిన 'హైబ్రిడ్ విధానం' మేలని గ్నాని డాట్ ఏఐ సీఈఓ గణేష్ గోపాలన్ సూచించారు. ఇది ఆవిష్కరణలను అడ్డుకోకుండా సమాచార భద్రతను రక్షిస్తుంది.
ప్రస్తుత ఐటీ చట్టాలు ఏఐ యుగానికి ముందటివని, డీప్‌ఫేక్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు దేశీయ అవసరాలకు తగిన సరికొత్త చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ఐటీ శాఖ ఇదివరకే వెల్లడించింది.
