- చావంటే భయంలేదని కామెంట్
- అతడి ఉగ్రకోణంపై దృష్టిసారించిన యూఏఈ అధికారులు
- ఒమన్ ఎయిర్ విమానాలు నడపకుండా నిషేధం
దుబాయ్/ టెల్అవీవ్: ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేయాలని అనుకున్నానని, చావంటే తనకు భయం లేదని ఆ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి అంగీకరించాడు. ఫ్లైదుబాయ్ విమాన కూల్చివేత కుట్ర కేసులో యూఏఈ అధికారుల విచారణలో హమామ్ సంచలన విషయాలు వెల్లడించాడని ఈ మేరకు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.
ఒమన్ దేశానికి చెందిన 29 ఏళ్ల హమామ్ ఉగ్రవాద చర్యకు పాల్పడేందుకు యత్నించినట్లు యూఏఈ అటార్నీ జనరల్ శనివారం తెలిపారని వెల్లడించింది. హమ్మామికి బయటి శక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంతో పాటు ఈ ఘటనపై సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ దర్యాప్తు ఉమ్మడిగా జరుపుతున్నాయని తెలిపింది.
విమానంలో ఉండే ఎమర్జెన్సీ గొడ్డలితో హమ్మామి తనపై పలుమార్లు దాడి చేశాడని, ఆ తర్వాత విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు యత్నించాడని పైలెట్ మచ్చర్ ఇదివరకే వెల్లడించారు. హమ్మామి ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించాడు. సంవత్సరాల తరబడి దుబాయ్‌లో నివసించాడు. సిరియాలో అసద్ పాలనకు వ్యతిరేకంగా ఇస్లామిక్ తిరుగుబాటుదారులు పోరాడిన సమయంలో అక్కడ కొంతకాలం గడిపిన అతను తీవ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అతని ఆన్‌లైన్ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు.
హమ్మామి డిలీట్ చేసిన ఎక్స్ ఖాతాలో 3 వేల పోస్టుల స్క్రీన్‌షాట్లను సేకరించారు. మహిళలు ఉద్యోగం చేయడాన్ని వ్యతిరేకించడం, ముసుగు ధరించే మతపరమైన మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలనడం వంటి పోస్టులు అతడు పెట్టినట్టుగా చెప్తున్నారు. సిరియా, లెబనాన్ వాడినని చెప్పుకుంటూ సౌదీ మహిళలకు వల వేశానని కూడా ఓ పోస్టులో చెప్పినట్లు గుర్తించారు.
ఒమన్ ఎయిర్ నిషేధం..
విమానాలు నడపడం అంటే తనకు ఎంతో ఇష్టమని 2022 జూన్‌లో పెట్టిన సోషల్ మీడియా పోస్టులో హమ్మామి అరబిక్ భాషలో రాసుకొచ్చాడు. ఫ్లైట్ శిక్షణ అనేది సాధారణ దినచర్య కాదని పేర్కొన్నాడు. మొదటి సోలో విమానయానం ప్రాముఖ్యతను, ప్రయాణికులను తీసుకెళ్లే విమానాన్ని ల్యాండ్ చేసే అనుభవాన్ని అందులో వివరించాడు.
తొలుత ప్రభుత్వ యాజమాన్యంలోని ఒమన్ ఎయిర్‌లో చేరడానికి ముందు అతను యూఏఈలో విమానయాన విద్యను అభ్యసించాడు. అయితే తీవ్రవాద వెబ్‌సైట్‌లను బ్రౌజ్ చేయడంలో హమ్మామి ఆసక్తిని గుర్తించిన అధికారులు, ఒమన్ ఎయిర్ యాజమాన్యం అతన్ని విమానాలు నడపకుండా నిషేధించారు. అతనికి డీ-రాడికలైజేషన్ (తీవ్రవాద భావజాలం నుంచి విముక్తి) కార్యక్రమాన్ని నిర్వహించి డెస్క్ ఉద్యోగం అప్పగించారు.
ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగం ఎలా?
ఒమన్ ఎయిర్ విమానాలు నడపకుండా నిషేధించిన తర్వాత హమ్మామి ఇతర అవకాశాల కోసం వెతికాడు. 2025లో రాయల్ ఎయిర్ మొరాకోలో చేరేందుకు ప్రయత్నించాడు. చివరకు యూఏఈలో అతనికి ఉపాధి దొరికింది. పైలట్లను నియమించుకునేటప్పుడు యూఏఈ విస్తృతమైన భద్రతా తనిఖీలు నిర్వహిస్తుంది. కానీ, హమ్మామి విషయంలో ఫ్లైదుబాయ్ ఎలాంటి పరిశీలన జరిపిందో తెలియరాలేదు.
హమ్మామిని విడిచిపెట్టాలన్న సిబ్బంది
ఫ్లైదుబాయ్ విమానం కూల్చివేత కుట్ర ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పైలెట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, ఫ్లైట్‌ను కూల్చేందుకు యత్నించిన కోపైలెట్ హమ్మామిని ప్రయాణికులు బంధించడానికి సంబంధించి ఈ వీడియోలో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
కో-పైలట్‌ను విడిచిపెట్టాలని ఫ్లైట్ సిబ్బంది డిమాండ్ చేసినట్టుగా రికార్డ్ అయింది. అతడిని పోలీసులకే అప్పగిస్తామని ప్రయాణికులు తేల్చిచెప్పడం కనిపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన చానెల్ ఐ24 న్యూస్ షేర్ చేసిన ఈ వీడియోలో, విమానం లోపల హమామ్ అల్-హమ్మామిని చేతులు వెనక్కి కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టారు. అతని బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయి.
ప్రార్థన ముసుగులో వెనక నుంచి దాడి చేశాడు: మచ్చర్
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనకు సంబంధించి కెప్టెన్ స్మిత్ మచ్చర్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం ఫోన్ చేసిన తనను పరామర్శించగా, ఆయన కాక్‌పిట్‌లోపల జరిగిన ఒళ్లు గగుర్పొడిచే నిజాలను బయటపెట్టారు. ‘‘కాక్‌పిట్‌లో కోపైలెట్ హమామ్ అల్-హమ్మామి ముందుగా ప్రార్థన చేసుకునేందుకని నా వెనక్కి వెళ్లాడు.
ఇది సాధారణ విషయమే కావడంతో నేను ముందుకు చూస్తూ విమానం నడుపుతున్నాను. ఇంతలో వెనక నుంచి అతడు గొడ్డలితో తలపై పదే పదే కొట్టాడు. ఆ దెబ్బలకు నాకు కండ్లు బైర్లు కమ్మాయి. కోపైలెట్ దాడి చేస్తున్నాడని గ్రహించి, అతడితో పోరాడుతూ కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసి, కింద పడిపోయాను. అతడు మళ్లీ డోర్ లాక్ చేశాడు. విమానం వేగంగా కిందకు పడిపోతోంది.
నేను చనిపోబోతున్నానని అనుకున్నాను. నా దగ్గర ఉన్న శక్తి అంతా ఉపయోగించి అతికష్టమ్మీద డోర్ దగ్గరికి వెళ్లి రెండో సారి లాక్ ఓపెన్ చేశాను. అప్పుడే ప్యాసింజర్లు లోపలికి వచ్చి కోపైలెట్‌ను బంధించడంతో పెను ప్రమాదం తప్పింది” అని నెతన్యాహుకు మచ్చర్ వివరించారు.
