జపాన్ దేశంలో క్రికెట్ ఫైటింగ్: ఇండియా Vs పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్ రెడీ

జపాన్ దేశంలో క్రికెట్ ఫైటింగ్: ఇండియా Vs పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్ రెడీ

క్రికెట్‎లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. దాయాదుల పోరును క్రికెట్‎లో మహా సంగ్రామంగా అభివర్ణిస్తారు. ఇంతటీ క్రేజ్ ఉండే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులే కాకుండా ప్రపంచంలోని క్రికెట్ ప్రియులు కూడా ఆశగా ఎదురు చూస్తుంటారు. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత, పాకిస్తాన్ క్రికెట్ జట్లు మళ్లీ తలపడలేదు. 

దీంతో ఈ హైఓల్టేజ్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. ఇండియా, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. జపాన్‎లోని ఐచి-నగోయాలో 2026, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు  2026 ఆసియా క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా ఈవెంట్‎లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ నేరుగా తలపడే ఛాన్స్ ఉంది. 

కానీ కొన్ని సమీకరణాల ప్రకారం మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా ఐసీసీ వరల్డ్ కప్‎లలో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‎లో ఉంటాయి. సో.. గ్రూప్ స్టేజీలో దాయాది జట్లు నేరుగా తలపడతాయి. కానీ ఆసియా కప్‎లో మాత్రం అలా కాదు. భారత్, పాకిస్తాన్ జట్లను వేర్వేరు గ్రూపులలో ఉంచుతారు. దీంతో గ్రూప్ దశలో ఈ రెండు జట్లు ఎదురుపడే ఆస్కారం లేదు. 

కాబట్టి ఆసియా కప్‎లో భారత్ వర్సెస్ పాక్ తలపడాలంటే రెండు సందర్భాలలో మాత్రమే సాధ్యమవుతోంది. ఒకటి.. ఫైనల్ పోరులో.. రెండు.. కాంస్య పతక మ్యాచ్‌లో మాత్రమే ఇండియా, పాక్ జట్లు తలపడే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ తమ సెమీఫైనల్ మ్యాచ్‌లలో గెలిస్తే ఫైనల్‌లో తలపడతాయి. ఒకవేళ ఇరు జట్లు తమ సెమీఫైనల్ మ్యాచ్‌లలో ఓడిపోతే, మూడో స్థానం కోసం జరిగే కాంస్య పతక పోరులో ఎదురుపడతాయి.