పాక్ క్రికెట్ సర్వనాశనం కావడానికి అసలు కారణం అదే.. ధోనీ వల్లే భారత క్రికెట్ ఎదిగింది!

పాక్ క్రికెట్ సర్వనాశనం కావడానికి అసలు కారణం అదే.. ధోనీ వల్లే భారత క్రికెట్ ఎదిగింది!

2007 వన్డే ప్రపంచకప్ (2007 ODI World Cup) తర్వాత భారత్, పాకిస్థాన్ జట్ల ప్రయాణం పూర్తిగా భిన్నమైన మార్గాల్లో కొనసాగిందని.. బీసీసీఐ (BCCI) తీసుకున్న సరైన నిర్ణయాలే టీమిండియాను శిఖరాగ్రానికి చేర్చాయని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ పాడ్‌కాట్‌లో మాట్లాడిన ఆయన, దాయాది దేశాల క్రికెట్ వ్యవస్థలపై విశ్లేషణ చేశారు.

ధోని నియామకమే టర్నింగ్ పాయింట్: 

2007 ప్రపంచకప్‌లో ఇరు జట్లు గ్రూప్ దశలోనే వెనుదిరిగినా, ఆ తర్వాత భారత క్రికెట్ బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయని యూసఫ్ ప్రశంసించారు. మహేంద్ర సింగ్ ధోనిని (MS Dhoni) కెప్టెన్‌గా నియమించడం ఇండియన్ క్రికెట్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. అలాగే, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) జూనియర్ క్రికెట్‌లో యువ ఆటగాళ్లను గుర్తించి, తీర్చిదిద్దిన విధానం వల్లే నేడు ఇండియన్ టీమ్ ప్రపంచాన్ని శాసించగలుగుతోందని పేర్కొన్నాడు. 

పాక్ ఆటగాళ్లు కష్టపడటం లేదు: 

పాకిస్థాన్ జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నేటి తరం ప్లేయర్స్ కష్టపడటం లేదన్నారు. తమకే అన్నీ తెలుసని వాళ్లు భావిస్తున్నారని మండిపడ్డారు. తాను బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలోనూ ఆటగాళ్లలో నేర్చుకోవాలనే తపన కన్పించలేదని వాపోయారు. కేవలం సోషల్ మీడియా ఒత్తిడి అని సాకులు చెబుతూ ప్రొఫెషనల్ క్రికెట్‌ను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు.

బాబర్ అజమ్‌పై తీవ్ర విమర్శలు: 

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ (Babar Azam) బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలు (Technical Flaws) ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవడానికి అతను ఇష్టపడట్లేదని యూసఫ్ వెల్లడించారు. న్యూజిలాండ్‌లో తాను కోచ్‌గా ఉన్నప్పుడు బాబర్‌కు తప్పులను వివరించినా అతను మార్పులు చేసుకోలేదన్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) లాంటి కెప్టెన్ జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు, అతన్ని పక్కన పెట్టడంతోనే పాక్ జట్టు పతనం ప్రారంభమైందని మహమ్మద్ యూసఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.