రాత్రి అయినా తగ్గని విద్యార్థులు.. అట్టుడుకుతున్న లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ

రాత్రి అయినా తగ్గని విద్యార్థులు.. అట్టుడుకుతున్న లవ్ లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ

పంజాబ్‌ ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) అట్టుడుకుతోంది. 2026 సెప్టెంబర్ 27(ఆదివారం) రాత్రి అయినా విద్యార్థులు ఎక్కడా తగ్గటం లేదు. నిరసనలు హింసాత్మకంగా మారటంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పోలీసులకు విద్యార్థులకు మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది.  పోలీసులపై రాళ్లు విసిరిన విద్యార్థులు, కనీసం మూడు పోలీసు వాహనాలను తగలబెట్టారు. 

శనివారం రాత్రి యూనివర్సిటీ ఆవరణలో జరిగిన అల్లర్లు, ఒక విద్యార్థిని గ్యాంగ్‌రేప్ కు  గురైందనే పుకార్లు, మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలతో  మొదలైన ఆందోళన.. తీవ్ర రూపం దాల్చింది. అమ్మాయిల హాస్టల్ సమీపంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి హైవేను బ్లాక్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఘర్షణలో అనేకమంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఒక పోలీసు వాహనం దెబ్బతిన్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. మరింత నష్టం జరగకుండా  పోలీసులు వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కపూర్తలా, జలంధర్ రూరల్, హోషియార్‌పూర్ నుంచి అదనపు బలగాలను సమీకరించారు.

దిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారి-44పై  మధ్యాహ్నం వరకూ రహదారి బ్లాక్ చేశారు విద్యార్థులు.  దీంతో భారీ ట్రాఫిక్ జాం అయ్యింది.  ట్రాఫిక్ పోలీసులు  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు, సిట్ ఏర్పాటు  :

సత్నాంపురా పోలీసు స్టేషన్‌లో అత్యాచారంపై  ఒక విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెప్టెంబర్ 23-24 తేదీల్లో జీహెచ్-3 అమ్మాయిల హాస్టల్‌లో మరో విద్యార్థినిపై దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ఫగ్వారా ఎస్‌పీ మేజర్ సింగ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.  ఇప్పటివరకు ఆరోపణలకు ఆధారాలు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎల్‌పీయూ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

చర్చలు విఫలం  

ఆదివారం ఉదయం పోలీసులు, విద్యార్థి ప్రతినిధులు, యూనివర్సిటీ యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. ఎఫ్‌ఐఆర్ కాపీ, ఎస్‌ఐటీ వివరాలు అందించినా ఆందోళన ఆగలేదు. విద్యార్థులు యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్ నుంచి హామీ కోరుతున్నారు విద్యార్థులు. వారిని శిక్షించకుండా, యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు అడ్డుకోకుండా చూడాలని కోరుతున్నారు.

యూనివర్సిటీ స్పందన  

ఎల్‌పీయూ వైస్ ఛాన్సలర్ జస్‌పాల్ సింగ్ సంధు మాట్లాడుతూ, ఇలాంటి దాడి జరిగినట్లు యూనివర్సిటీకి తెలియదని, దర్యాప్తులో సహకరిస్తామని అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాతి ఆన్‌లైన్‌లో వ్యాపిస్తున్న ఆరోపణలు అబద్ధాలు, నిరాధారమైనవిగా పేర్కొన్నారు. బయటి వ్యక్తులు అల్లర్లలో పాల్గొన్నారని యూనివర్సిటీ ఆరోపిస్తోంది.