మమతా బెనర్జీ పార్టీ గుర్తు ఎవరిది: శివసేన తరహాలోనే దీదీకి కష్టాలు

మమతా బెనర్జీ పార్టీ గుర్తు ఎవరిది: శివసేన తరహాలోనే దీదీకి కష్టాలు

న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తు వివాదంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు డెడ్‎లైన్ విధించింది. మూడు నెలల్లోగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. రాబోయే నాలుగు వారాల్లోగా ఈసీకి తమ వాదనలను సమర్పించాలని టీఎంసీ రెండు వర్గాలకు సూచించింది. మొత్తం నాలుగు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని సుప్రీం కోర్టు ఈసీని ఆదేశించింది. 

2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రెండు వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే. రితబట్రా బెనర్జీ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగరేశారు. టీఎంసీ పార్టీ పేరు, దాని రిజర్వ్‌డ్ ఎన్నికల గుర్తు అయిన పూలు-గడ్డి సింబల్ తమకే చెందుతుందని ఇరువర్గాలు ఈసీని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీ పేరు, గుర్తును ఈసీ ఫ్రీజ్ చేసింది. 

నందిగ్రామ్, రెజీనగర్ ఉప ఎన్నికల్లో టీఎంసీ పార్టీ పేరు, గుర్తు వాడటాన్ని నిషేధిస్తూ మమతా బెనర్జీ, రితబట్రా బెనర్జీ వర్గాలకు ప్రత్యామ్నాయ పేరు, గుర్తులు కేటాయించింది. టీఎంసీ పేరు, గుర్తును వాడకుండా ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

►ALSO READ | పెండింగ్ ఛలాన్ల ఫైన్ను కరెంట్ బిల్లులో కలిపేయండి: సుప్రీం కోర్టు

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం (సెప్టెంబర్ 28) ఈ పిటిషన్‎పై చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే నాలుగు వారాల్లోగా ఈసీకి తమ వాదనలను సమర్పించాలని టీఎంసీ రెండు వర్గాలకు ధర్మాసనం సూచించింది. 

ఆ తర్వాత మూడు నెలల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. పిటిషన్ల విచారణకు ఆరు నెలల సమయం కావాలన్న ఈసీ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నాలుగు నెలల్లో ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఈసీకి సూచించింది. సుప్రీం కోర్టు డెడ్ లైన్‎తో నాలుగు నెలల్లో టీఎంసీ పేరు, గుర్తు ఏ వర్గానికి దక్కనుందనే ఉత్కంఠకు తెరపడనుంది.