మీ వద్ద ఉన్న డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయమైన అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కొద్దిశాతం వడ్డీ తేడానే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. పెద్ద మొత్తంలో వచ్చే రాబడిని కోల్పోవాల్సి వస్తుంది. తెలివిగా ఎక్కువ వడ్డీ లభించే చోట డిపాజిట్ చేయడం ద్వారా అదనపు లాభాలు పొందాలనుకుంటే ఈ స్టోరీ మీకోసమే..
ప్రస్తుతం బంధన్ బ్యాంక్ అత్యధికంగా 7.45% వడ్డీని 2 సంవత్సరాల కాలపరిమితికి అందిస్తోంది. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 3 సంవత్సరాల డిపాజిట్‌పై 7.25% గరిష్ట వడ్డీ రేటును ఇస్తోంది. అదే సమయంలో దేశీయ దిగ్గజ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐలో అత్యధిక రెగ్యులర్ రేటు 444 రోజుల కాలపరిమితికి 6.45% మాత్రమే ఉంది. ఈ విధంగా బంధన్ బ్యాంక్ వడ్డీ రేటు ఎస్‌బీఐ కంటే 1 శాతం ఎక్కువగా ఉండగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రేటు 0.80 శాతం అధికంగా ఉంది స్టేట్ బ్యాంక్ కంటే.
ఏడాదికి రూ.5వేలు ఎక్కువ వడ్డీ..
వడ్డీ రేట్లలో చిన్న వ్యత్యాసం ఉన్నప్పటికీ.. డిపాజిట్ మొత్తం పెరిగే కొద్దీ వచ్చే లాభంలో భారీ తేడా ఉంటుంది. ఉదాహరణకు.. రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే బంధన్ బ్యాంక్‌లో 7.45% వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 37వేల 250 లభిస్తుంది. ఇది ఎస్‌బీఐతో పోలిస్తే రూ.5వేలు ఎక్కువ. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో 7.25% వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 36వేల 250 లభిస్తుంది. ఇది ఎస్‌బీఐ కంటే రూ.4వేలు ఎక్కువ. ఎస్‌బీఐలో మాత్రం అదే రూ.5లక్షలకు కేవలం రూ.32వేల 250 వడ్డీ వస్తోంది.
పెట్టుబడి పెరిగేకొద్దీ సంపాదన ఏ విధంగా పెరుగుతుందో చూస్తే, ఒకవేళ మీరు రూ.లక్ష డిపాజిట్ చేస్తే బంధన్ బ్యాంక్ ద్వారా సంవత్సరానికి రూ.1,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ద్వారా సంవత్సరానికి రూ. 800 అదనంగా పొందవచ్చు. ఒకవేళ డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలకు చేరితే.. ఎస్‌బీఐతో పోలిస్తే బంధన్ బ్యాంక్ ద్వారా సంవత్సరానికి రూ.10వేలు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ద్వారా సంవత్సరానికి రూ.8వేల వరకు అదనపు వడ్డీ రూపంలో లాభం పొందవచ్చు.
అయితే కేవలం అత్యధిక వడ్డీ రేటును చూసి మాత్రమే గుడ్డిగా ఎఫ్‌డీ చేయకూడదు. కాలపరిమితి, ముందస్తు విత్‌డ్రా రూల్స్, పన్ను విధింపు వంటి అంశాలను గమనించాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం ప్రతి బ్యాంకులోనూ అసలు వడ్డీ కలిపి రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు పూర్తి భద్రత ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించి మీకు నప్పే సరైన బ్యాంకును ఎంచుకోవడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.
