ఇవాళ (ఆగస్టు 13) ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన.. మొదటి విడతలో 7,340 ఫ్లాట్ల నిర్మాణం..

ఇవాళ (ఆగస్టు 13) ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన.. మొదటి విడతలో 7,340 ఫ్లాట్ల నిర్మాణం..
  • కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో  సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం 
     
  • మొదటి విడతలో 7,340 ఫ్లాట్ల నిర్మాణం 
  • ప్రజల నుంచి అనూహ్య స్పందన
  • ఇప్పటికే 50 వేల దరఖాస్తులు.. 
  • ఆగస్టు15 వరకూ గడువు
  • టవర్ల నిర్మాణానికి ఇప్పటికే  టెండర్లు పిలిచిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో బస్తీ పేదల కలల సౌధాలు సాకారం కానున్నాయి. కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) ప‌‌‌‌‌‌‌‌రిధిలోని16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లను నిర్మించనున్నారు. 

ఇందుకోసం 90 ఎకరాల ప్రభుత్వ భూములను ఎంపిక చేశారు. కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో 5 ఎక‌‌‌‌‌‌‌‌రాల్లో నాలుగు ట‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్స్ నిర్మిస్తారు. ఒక ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో12 ఫ్లాట్స్.. ఒక్కో ట‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లో 120 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. సుమారుగా 480 ఫ్లాట్ల నిర్మాణానికి రూ. 43.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భూముల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి పేదల సొంతింటికల నెరవేర్చేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఒక్కో ఇందిరమ్మ ఇల్లు బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్, హాల్, కిచెన్‌‌‌‌‌‌‌‌తో కలిపి 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్‌‌‌‌‌‌‌‌డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో లబ్ధిదారుడికి లభించే భూమి వాటా విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది. 

ఇందిరమ్మ ఇళ్లకోసం ఆగస్టు 15 వరకు అప్లై చేసుకునేందుకు గడువు ఉండగా బుధవారం వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి   హౌసింగ్ బోర్డు టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 19వరకు గడువు విధించింది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టవర్ల నిర్మాణం స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తి చేసి బోనాలకు గృహ ప్రవేశం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

అర్హతలు, కేటాయింపు ఇలా..  

  •     16 నియోజకవర్గాల్లో రూ. 807.40 కోట్లతో 7,340 ఫ్లాట్ల నిర్మాణం
  •     ఒక్కో ఇంటికి 400 చ.అ. కార్పెట్ ఏరియా, 528 చ.అ. బిల్డప్ ఏరియా 
  •     ఒక్కో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ సబ్సిడీ రూ. 5 లక్షలు.. లబ్ధిదారుడి వాటా రూ. 6 లక్షలు. 
  •     కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారు అర్హులు. 
  •     క్యూర్ పరిధిలో సొంత ఇల్లు, ప్లాట్ లేదా ఫ్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. 
  •     నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాలి.
  •     అర్హతలన్నీ పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు.
  •     ఫ్లాట్ల కేటాయింపులో ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు. 
  •     ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్, క్లాస్-4, పారిశుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50 శాతం ఫ్లాట్లు జనరల్ కేటగిరీ వారికి కేటాయిస్తారు. 
  •     అన్ని కేటగిరీల్లో 30 శాతం ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు.
  •     దరఖాస్తు ఫీజు రూ.100. టోకెన్ అడ్వాన్స్ రూ. 10 వేలు. ఫ్లాట్ అలాట్ కాకపోతే ఈ డబ్బు తిరిగి చెల్లిస్తారు. ఫ్లాట్ కేటాయిస్తే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు. 
  •     లబ్ధిదారులు ప్రొవిజనల్ అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్ సమయంలో రూ. లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ. 2 లక్షలు, ఫినిషింగ్ దశలో మరో రూ. 2 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ అప్పగించే సమయంలో చెల్లించాలి.  

    దరఖాస్తు సమయంలో ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. మీసేవా కేంద్రాలు, మీ సేవా వాట్సాప్ సర్వీస్ 8096958096 ద్వారా ఈ నెల15లోపు అప్లై చేసుకోవచ్చు.  

పారదర్శకంగా ఎంపిక: పొంగులేటి

దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫార్సులు, అవకతవకలకు తావులేకుండా పారదర్శక పద్ధతిలో డ్రా విధానంలో ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నట్టు హౌజింగ్​శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.