ఉపాధి హామీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలొస్తలే.. అమలు కాని ఒకటో తేదీ జీతం ఉత్తర్వులు.. కేంద్రం నిధులు ఇవ్వట్లేదంటున్న ఆఫీసర్లు

ఉపాధి హామీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలొస్తలే.. అమలు కాని ఒకటో తేదీ జీతం ఉత్తర్వులు.. కేంద్రం నిధులు ఇవ్వట్లేదంటున్న ఆఫీసర్లు
  • ఆర్థిక ఇబ్బందుల్లో 15 వేల మందిపైగా ఉద్యోగులు
  • సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సిబ్బంది డిమాండ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ (వీబీజీ రామ్ జీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాల ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలు జారీ చేసినా.. ఉపాధి హామీ ఉద్యోగుల వద్దకు వచ్చే సరికి ఆ ఉత్తర్వులు అమలుకావడం లేదు. 

మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో వేలాది మంది సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. నెల నెలా జీతం అందకపోవడంతో ఇంటి రెంట్లు, ఈఎంఐలు, పిల్లల స్కూల్, కాలేజీ ఫీజుల చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటవ తేదీనే జీతాలు వచ్చేలా చూడాలని ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. కేంద్రం నుంచి నిధులు రాలేదని, పోర్టల్‌‌‌‌‌‌‌‌లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారని వాపోతున్నారు. 

  • రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మందికిపైగా ఉద్యోగులు

ఉపాధి పథకంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో  ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్, అకౌంట్స్ ఆపరేటర్లు, అటెండర్లు, ఏపీవోలు, ఈసీలు, సాట్ (ఎస్​ఎస్​ఏఏటీ సోషల్ ఆడిట్) సిబ్బంది, అంబుడ్స్ పర్సన్స్​, విజిలెన్స్​ సిబ్బంది, డ్రైవర్లతో పాటు జిల్లా, మండల  కేంద్రాల్లో పనిచేసే ఇతర సిబ్బంది, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 

వీరికి గత 90 రోజులుగా జీతాలు అందడం లేదు. ఉపాధి హామీ సిబ్బంది జీతాల చెల్లింపుల్లో ప్రతిసారీ జాప్యం జరగడానికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు పలు సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు.

కేంద్రం నిధుల జమలో ఆలస్యం !

ఉపాధి హామీ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ ఐఎఫ్ఎంఎస్​పోర్టల్ ద్వారానే విడుదల చేస్తుంది. కేంద్రం నుంచి స్టేట్ నోడల్ అకౌంట్ కి నిధులు జమ కావడంలో ఆలస్యం కావడం వల్ల పేమెంట్లు నిలిచిపోతున్నాయని తెలుస్తోంది. అలాగే సిబ్బంది హాజరు, పనితీరు వంటి వివరాలను మండల స్థాయిలో ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఓలు జనరేట్ చేసి స్టేట్​ఆఫీస్​ పంపించాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ అప్‌‌‌‌‌‌‌‌డేట్లు, సర్వర్ డౌన్ సమస్యల వల్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఓల ఆమోదం పొందడానికి సమయం పడుతోందని చెప్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం జీతాల చెల్లింపును ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కి మార్చడం, కొంతమంది ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నంబర్ మ్యాపింగ్ కాకపోవడం వల్ల సాంకేతిక కారణాలతో జీతాలు ఆగిపోతున్నాయి. 

మరో వైపు కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా విడుదలలో ఆలస్యం కావడం వల్ల కూడా జీతాల ఫైల్స్ ఆర్థిక శాఖ దగ్గర నిలిచిపోతున్నాయని తెలుస్తోంది. గతంలో కూడా ఇలాగే మూడు నెలల పాటు జీతాలు ఆగడంతో ఉద్యోగులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో స్పందించిన పంచాయతీరాజ్​శాఖ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేసింది. 

మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం కావడంపై ఉపాధి హామీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి పెండింగ్​లో ఉన్న మూడు నెలల వేతనాలను ఒకే సారి విడుదల చేయాలని, ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు ఇచ్చేలా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాయి.