- ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ నుంచి సాధ్యమైనంత ఎత్తిపోయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి
- గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై కన్సల్టెన్సీని నియమించాలి
- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌తో కలిసి నీటిపారుదల శాఖపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితోపాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా ఎత్తిపోసుకోవాలని సూచించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నీటిపారుదలశాఖపై రివ్యూ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడంలేదన్నారు.
మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్టు తేలిందని మంత్రి ఉత్తమ్ తెలపగా.. దీనిపై ఎన్డీఎస్ఏని మరోసారి సంప్రదించాలని సీఎం సూచించారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్ది పాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాలన్నారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. అధికారులు ఆ పనులను పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉంటుందని తెలిపారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియమించాలని సీఎం ఆదేశించారు. రివ్యూలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ ఈ.శ్రీధర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
