- కోర్టు కేసులు విత్‌డ్రా.. రీడిప్లాయ్‌మెంట్ కూడా పూర్తి
- అడ్డంకులు తొలగినా మొదలుకాని ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న డాక్టర్ల ప్రమోషన్లు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న కోర్టు కేసులు, అడ్మినిస్ట్రేషన్ సమస్యలు ఇప్పుడు లేకున్నా.. ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. ఆరోగ్య శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) విభాగాల్లో ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, సెకండరీ హెల్త్ సర్వీసెస్ లో మాత్రం ప్రమోషన్ల ఊసే ఎత్తడంలేదు. 2025–-26 ప్యానెల్ ఇయర్ ఈ ఆగస్టు చివరితో ముగియనుంది. దీంతో ప్రమోషన్లకు అర్హులైన దాదాపు 300 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సర్జన్లలో ఆందోళన మొదలైంది. ఆగస్టులోగా ప్రమోషన్లు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తొలగిపోయిన న్యాయ, పరిపాలనా అడ్డంకులు..
సెకండరీ హెల్త్‌లో ప్రమోషన్లు నిలిచిపోవడానికి కారణమైన ప్రధాన అడ్డంకులు ప్రస్తుతం తొలగిపోయాయి. 2023లో ప్రమోషన్లకు సంబంధించి కొందరు డాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఆ కేసులను పిటిషనర్లు 2025లోనే విత్‌డ్రా చేసుకున్నారు. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్, డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ సర్జన్ (ఆర్‌ఎంఓ), డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ (ఆర్‌ఎంఓ) పోస్టులకు ప్రస్తుతం లీగల్ సమస్యలు లేవని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు ఏరియా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా మార్చినప్పుడు అక్కడ పనిచేసిన టీవీవీపీ సిబ్బందిని తిరిగి సెకండరీ హెల్త్ పరిధిలోకి తీసుకొచ్చే రీడిప్లాయ్‌మెంట్ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ప్రమోషన్లకు ఉన్న న్యాయ, పరిపాలనా అడ్డంకులు తొలగిపోయినట్లేనని వైద్యులు అంటున్నారు.
డీఎంఈ, డీహెచ్ లలో సాగుతున్న ప్రక్రియ..
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఇతర విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. డీఎంఈ పరిధిలో అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నారు. డీహెచ్ పరిధిలోనూ అర్హులైన డాక్టర్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. కానీ సెకండరీ హెల్త్ విభాగంలో మాత్రం ప్రక్రియ మొదలు కాలేదు. ప్యానెల్ ఇయర్ ముగిసేలోగా ప్రమోషన్లు ఇవ్వకపోతే సీనియారిటీ, సర్వీస్ బెనిఫిట్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాంటి కోర్టు కేసులు లేకపోవడంతో వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెట్టి, ఆగస్టు చివరినాటికి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
