- తెలంగాణకు 11. 56 లక్షల పీఎంఏవైజీ ఇండ్లు కేటాయించండి
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జీ 2.0) కింద తెలంగాణకు 11,56,915 ఇండ్లను ఒకేసారి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మంత్రి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ పాల్గొన్నారు. దాదాపు 20 నిమిషాలకు సాగిన ఈ భేటీలో.. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల గృహ అవసరాలను వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో గత 12 ఏండ్లుగా పేదల గృహ నిర్మాణం నిలిచిపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఇండ్ల కోసం 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. ఆవాస్ ప్లస్–2024 యాప్ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించగా 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇండ్లకు అర్హులుగా తేలారని తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులందరికీ ఒకేసారి ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. పీఎంఏవైజీ కింద కేంద్ర వాటాతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, కేంద్రం నుంచి పీఎంఏవైజీ ఇండ్ల కేటాయింపు జరిగితే గ్రామీణ పేదల సొంతింటి కలను మరింత వేగంగా నెరవేర్చగలమని మంత్రి పేర్కొన్నారు.
