సినీ రేంజ్‎లో గాల్లో హైడ్రామా.. నిమిషాల్లోనే 28 వేల అడుగులకు ఫ్లైట్ డౌన్.. 7700 ఎమర్జెన్సీ కోడ్‌ యాక్టివేట్

సినీ రేంజ్‎లో గాల్లో హైడ్రామా.. నిమిషాల్లోనే 28 వేల అడుగులకు ఫ్లైట్ డౌన్.. 7700 ఎమర్జెన్సీ కోడ్‌ యాక్టివేట్

లండన్: బ్రిటిష్ ఎయిర్‎వేస్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం అకస్మాత్తుగా సుమారు 28 వేల అడుగుల కిందకు పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లను ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని లండన్‎లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

అధికారుల వివరాల ప్రకారం.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‏కు చెందిన బోయింగ్ విమానం BA295 సోమవారం (అక్టోబర్ 5) లండన్ హీత్రూ నుంచి అమెరికాలోని చికాగోలోని ఓ'హేర్‌కు బయలుదేరింది. విమానం 37 వేల అడుగుల ఎత్తులో ఐర్లాండ్ మీదుగా ప్రయాణిస్తోన్నప్పుడు ఫ్లైట్‎లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దీంతో విమానం 37 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా 28 వేల అడుగుల కిందకు పడిపోయింది. సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అప్రమత్తమైన పైలట్లు అంతర్జాతీయ ఎమర్జెన్సీ సిగ్నల్ అయిన 7700 స్క్వాక్ కోడ్‌ను యాక్టివేట్ చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‎కు సమాచారం అందించారు.

 ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చికాగో వెళ్లాల్సిన ఈ ప్రయాణాన్ని రద్దు చేసి విమానాన్ని తిరిగి లండన్‌లోని హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో తలెత్తిన సమస్య గురించి బ్రిటిష్ ఎయిర్‎వేస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

ఎమర్జెన్సీ స్క్వాకింగ్ 7700 కోడ్ అంటే ఏమిటి..?

విమానం గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా తీవ్రమైన ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడితే పైలట్లు విమానంలోని ట్రాన్స్‌పాండర్ అనే పరికరంలో ఈ 4 అంకెల కోడ్‌ను (7700) యాక్టివేట్ చేసి ఏటీసీకి సమాచారం ఇస్తారు. ఒక విమానం 7700 కోడ్‌ను పంపినప్పుడు దానిని సాధారణ అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు. 

పైలట్లు 7700 కోడ్ ఎంటర్ చేయగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ స్క్రీన్‌లపై ఆ విమానం ఉన్న ప్రాంతం ఎరుపు రంగులో ఫ్లాష్ అవుతూ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీంతో సదరు విమానానికి ల్యాండింగ్ కోసం ఏటీసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆ మార్గంలో లేదా విమానాశ్రయం రన్‌వేపై ఉన్న ఇతర విమానాలను పక్కకు తప్పించి 7700 కోడ్‌ యాక్టివేట్ చేసిన ఫ్లైట్‎కు ల్యాండింగ్‎కు పర్మిషన్ ఇస్తారు.