న్యూఢిల్లీ: మసాలా దినుసుల తయారీ కంపెనీ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు చెందిన 'ప్రీ-ప్యాక్డ్ జీలకర్ర పొడి'ని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశించింది. ల్యాబ్ పరీక్షల్లో ఈ శాంపిల్ వినియోగానికి సురక్షితం కాదని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
గోవాలోని ఓ రిసార్ట్ నుంచి సేకరించిన ఎవరెస్ట్ జీలకర్ర పొడి నమూనాలను పరీక్షించగా.. వాటిలో 'అజోక్సిస్ట్రోబిన్', 'థయామెథోక్సామ్' అనే పురుగుమందుల అవశేషాలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. కంపెనీ అప్పీల్ మేరకు రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో రీటెస్ట్ చేసినప్పటికీ, శాంపిల్ 'అన్‌సేఫ్' అని తేలింది.
దీంతో ఆ నిర్దిష్ట బ్యాచ్‌ను వెంటనే రీకాల్ చేసి, రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఎవరెస్ట్‌ను ఆదేశించింది. మరోవైపు, తీవ్ర పరిశుభ్రతా లోపాల వల్ల 'క్రియేటివ్ బేకర్స్ అండ్ కన్ఫెక్షనర్స్' లైసెన్స్‌ను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది.
