ఇస్లామాబాద్: డబ్ల్యూసీఎల్ (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్) లీగ్ మూడవ ఎడిషన్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయకపోవడంతో ఆ జట్టు లీగ్ నుంచి నిష్క్రమించింది. లీగ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3వ తేదీన షార్జా వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఎన్వోసీ జారీ చేయలేదు. దీంతో ఈ మ్యాచ్ వాయిదా పడింది.
పాకిస్తాన్ ఛాంపియన్స్ యజమాని కమీల్ ఖాన్ ఎన్ఓసీ జారీ చేయకూడదనే తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించమని పీసీబీని కోరారు. కానీ పీసీబీ ఇందుకు నిరాకరించింది. డబ్ల్యూసీఎల్లో పాల్గొనే ఆటగాళ్లకు ఎన్వోసీ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్ చాంపియన్స్ టోర్నీ నుంచి వైదొలిగింది. పాకిస్తాన్ చాంపియన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
‘‘డబ్ల్యూసీఎల్లో పాల్గొనే ఆటగాళ్లకు ఎన్వోసీ ఇచ్చేందుకు పీసీబీ తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ మూడో ఎడిషన్‌లో తమ జట్టు పాల్గొనలేదని పాకిస్తాన్ ఛాంపియన్స్ విచారంతో ధృవీకరిస్తోంది. మేం పీసీబీ అధికారాన్ని, దాని నిర్ణయాన్ని గౌరవిస్తాము. అయితే క్రికెట్ దిగ్గజాలు పాల్గొనే ఈ ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఛాంపియన్స్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం మా ఆటగాళ్లకు లభించనందుకు సహజంగానే నిరాశ చెందుతున్నాము. మా ఆటగాళ్లకు, మద్దతుదారులకు, అభిమానులకు వారి సహనానికి, అవగాహనకు నిరంతర మద్దతుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము’’ పాకిస్తాన్ ఛాంపియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్ నిరాకరణ.. పాక్ ఔట్
డబ్ల్యూసీఎల్ 2025 ఎడిషన్‌లో పాకిస్తాన్ జట్టుతో ఆడేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. 2025, ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ తమకు రాతపూర్వక క్షమాపణలు చెబితేనే 2026 లీగ్‌లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని పీసీబీ డిమాండ్ చేసింది. పీసీబీ డిమాండ్‌ను డబ్ల్యూసీఎల్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూసీఎల్ లో ఆడేందుకు పాక్ ఆటగాళ్లకు పీసీబీ ఎన్ఓసీ జారీ చేయలేదు. దీంతో ఆ జట్టు అఫిషియల్ గా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
