బాలీవుడ్ హస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ కు సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. రూ. 5 కోట్ల చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు గడువు ఇచ్చినా సకాలంలో చెల్లించలేదంటూ సీరియస్ అయింది. అక్టోబర్ 7వ తేదీ వరకు చివరి అవకాశం ఇస్తూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
జైలే సరైన స్థలం...
రాజ్ పాల్ యాదవ్ రూ. 5 కోట్ల చెక్ బౌన్స్ కేసును సుప్రీం కోర్టు మరోసారి విచారించింది. ఆయన తీరుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.2 కోట్లు డిపాజిట్ చేయడంలో రాజ్‌పాల్ తీవ్రంగా విఫలమయ్యారని పేర్కొంది.. ఆయన తరఫు లాయర్ రూ.50 లక్షల నాలుగు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ఫోటోకాపీలను చూపించగా.. పిటిషనర్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నటుడు రాజ్‌పాల్ యాదవ్ యాక్టింగ్‌లో చాలా దిట్ట అని, కేవలం ఫోటోకాపీల ఆధారంగా నమ్మలేమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానికి స్పందించిన ధర్మాసనం.. హృదయపూర్వకంగా చెప్పాలంటే ఆయన పిటిషన్‌ను కొట్టిపారేయాలని ఉంది.. ఆయనకు జైలులోనే సరైన స్థలం. కానీ బాధితుడికి కొంత డబ్బైనా రావాలనే ఉద్దేశంతో ఆగాల్సి వస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అసలేం జరిగింది?
2010లో రాజ్‌పాల్ యాదవ్ తన 'అతా పతా లపతా' సినిమా నిర్మాణం కోసం ముర్లీ ప్రాజెక్ట్స్ కంపెనీ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. తిరిగి రూ.8 కోట్లు ఇస్తానని ఒప్పందం చేసుకోగా.. ఆపై ఇచ్చిన చెక్కులన్నీ వరుసగా బౌన్స్ అయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో ఆయనకు గతంలో జైలు శిక్ష కూడా విధించారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు.
సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం ముగిసినా.. కనీసం గడువు పొడిగింపు పిటిషన్ కూడా వేయకపోవడంపై తీవ్రంగా సుప్రీం కోర్టు మండిపడింది. మంగళవారం లోగా రూ.2 కోట్లు కట్టాలని "లాస్ట్ ఛాన్స్" ఇస్తూ, సరెండర్ మినహాయింపును అక్టోబర్ 7 వరకు మాత్రమే పొడిగించింది. అయితే అప్పటికీ డబ్బు డిపాజిట్ చేయకపోతే రాజ్‌పాల్ యాదవ్ నేరుగా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందన్న చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
