హైదరాబాద్: నకిలీ కరెన్సీని సేకరించి చలామణి చేస్తున్న ముఠాపై గోషామహల్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే విక్రమ్ (21), అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. తాజాగా రాకేష్ కుమావత్, శంకర్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గోషామహల్ సీఐ బి. శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 25న బేగంబజార్ ఛత్రి సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన విక్రమ్‌ను ఏఎస్సై జనార్దన్‌నాయక్, హెచ్‌సీ సంజయ్‌కుమార్ శర్మ అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతని వద్ద రూ.8 వేల విలువైన 16 నకిలీ రూ.500 నోట్లు లభించాయి. విచారణలో ఒక్కో నకిలీ నోటును రూ.400 అసలు నగదుకు చిల్లర వ్యాపారులకు ఇచ్చినట్లు విక్రమ్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ నోట్లను అశోక్ నుంచి తీసుకున్నాడని, అశోక్ వాటిని రాకేష్ కుమావత్ నుంచి పొందినట్లు దర్యాప్తులో తేలింది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నకిలీ కరెన్సీ లావాదేవీలు
దర్యాప్తులో భాగంగా ఈ నెల 4న బేగంబజార్‌లో రాకేష్ కుమావత్‌ను, అనంతరం చక్నవాడిలో శంకర్‌లాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాకేష్ వద్ద రూ.3 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శంకర్‌లాల్ వద్ద రూ.2 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.శంకర్‌లాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రసాద్ అనే వ్యక్తిని సంప్రదించినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. రూ.5 వేల అసలు నగదుకు రూ.15 వేల నకిలీ కరెన్సీని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాకుండా రూ.1.50 లక్షల అసలు నగదుకు రూ.3 లక్షల నకిలీ కరెన్సీ సరఫరా చేసే లావాదేవీలో శంకర్‌లాల్ మధ్యవర్తిత్వం వహించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. నకిలీ కరెన్సీ సరఫరా వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
