- రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు
- నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచే ఎక్కువ
- 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల మెషీన్లు పంపిణీ
- ప్రారంభమైన లబ్ధిదారుల ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమెషీన్ స్కీమ్‌కు బీసీ మహిళల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.80 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 119 నియోజకవర్గాల్లో మొత్తం 1.19 లక్షల కుట్టుమెషీన్లను 100 శాతం సబ్సిడీపై ఉచితంగా అందించనున్నారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగస్టు 13న పథకాన్ని ప్రారంభించి అదే రోజు నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించగా, ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
నల్గొండ నుంచే 29,500 అప్లికేషన్లు..
నల్గొండ జిల్లాలో అత్యధికంగా 29,500 అప్లికేషన్లు వచ్చాయి. నిజామాబాద్‌లో 26,961, జగిత్యాలలో 26,784, సిద్దిపేటలో 24,600, కరీంనగర్‌లో 23,500 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సుమారు 10 వేల అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. జగిత్యాల, ధర్మపురి, బాల్కొండ, హుస్నాబాద్, హుజూరాబాద్, కామారెడ్డి, కొడంగల్ నుంచి కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కార్వాన్‌లో 236, చార్మినార్‌లో 271, బహదూర్‌పురలో 541, గోషామహల్‌లో 777, జూబ్లీహిల్స్‌లో 613, సనత్‌నగర్‌లో 211 అప్లికేషన్లు వచ్చాయి. యాకుత్‌పుర, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ వెయ్యిలోపే దరఖాస్తులు నమోదయ్యాయి.
రెండు నెలల్లో ఎంపిక..
అప్లికేషన్ల గడువు ముగియడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నియోజకవర్గాలు, మండలాల వారీగా ఎంపీడీవోలు అర్హులను గుర్తించి లిస్ట్‌ను కలెక్టర్లకు పంపనున్నారు. మరోసారి వెరిఫికేషన్ తర్వాత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి పంపి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. భారీగా అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించారు. ఎంపిక ప్రక్రియకు సుమారు రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నవంబర్ 19 లేదా డిసెంబర్ 9న కుట్టుమెషీన్లు పంపిణీ చేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నెల 8న కంపెనీ ఖరారు..
కుట్టుమెషీన్ల సరఫరా కోసం బీసీ కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లు దాఖలు చేసేందుకు గడువును ఈనెల 8 వరకు పొడిగించారు. ఆ తర్వాత టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలించి కంపెనీని ఎంపిక చేయనున్నారు. ఉష, సింగర్, బ్రదర్ కంపెనీలకు టెండర్‌లో అవకాశం కల్పించారు. ఇటీవల నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి ఈ మూడు కంపెనీలతో పాటు 15 మంది డీలర్లు హాజరయ్యారు. మరికొన్ని కంపెనీలు, డీలర్లు కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
