కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌కు బ్రేక్

కల్యాణలక్ష్మి,  షాదీ ముబారక్‌‌కు బ్రేక్
  •     పథకాల చట్టబద్ధతపై కౌంటర్‌‌‌‌ దాఖలు చేయని ప్రభుత్వం
  •     4 వారాలు గడువిచ్చినా మళ్లీ గడువు కోరడంపై హైకోర్టు అసంతృప్తి 
  •     8 జీవోల అమలుపై స్టే.. లబ్ధిదారులకు చెల్లింపులు నిలిపివేత
  •     మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌ పథకాలకు హైకోర్టు బ్రేక్‌‌ వేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించిన చట్టబద్ధత కోరుతూ కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని 4 వారాల గడువు ఇచ్చినా.. మళ్లీ గడువు కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి రాజ్యాంగబద్ధమైన సందేహాలున్న అంశంలో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయకపోవడంతో ఈ పథకాల నిమిత్తం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే ఉత్తర్వులిచ్చింది. అంతేకాకుండా, లబ్ధిదారులకు చెల్లింపులు చేయరాదని స్పష్టం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌ పథకాల నిమిత్తం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌‌గోపాల్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌‌ ఎన్వీ శ్రవణ్‌‌కుమార్‌‌ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ వాదనలు వినిపిస్తూ.. ఈ పథకాల అమలు నిమిత్తం జారీ చేసిన జీవోలకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అవివాహిత యువతులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో 2014లో ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభించిందని తెలిపారు. అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకూ విస్తరించిందన్నారు. అయితే, ఈ పథకాల అమలుకు చట్టపరమైన, శాసనపరమైన ఆధారం లేదన్నారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా పథకాలను కొనసాగించడం, అర్హతలు, ఆదాయ పరిమితులు నిర్ణయించడం చట్టబద్ధంకాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధి నుంచి భారీగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నందున రాజ్యాంగంలోని అధికరణ 202(3), 204(3), 266(3), 283(2)లకు విరుద్ధంగా ఉందన్నారు. అంతేగాకుండా, ఈ పథకాల కింద లబ్ధిదారుల వర్గీకరణ కూడా రాజ్యాంగంలోని అధికరణ 14, 15లకు విరుద్ధమని ఆయన చెప్పారు. 

రాజకీయ ప్రయోజనాల కోసమే..

కార్యనిర్వాహక వ్యవస్థ శాసనాధికారాలను వినియోగించలేదని, ప్రజాధనాన్ని రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. అధికరణ 246 ప్రకారం చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్, శాసనసభలకు మాత్రమే ఉంటుందని, కార్యనిర్వాహక వర్గం ఆ అధికారాలను చెలాయించలేదని వాదించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాల ఆధారంగా 2014 నుంచి ఇప్పటివరకు ఈ పథకాల కోసం రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఏ వర్గం అభివృద్ధికి తీసుకునే నిర్ణయం శాసనపరమైన అధికార పరిధిలోనే ఉండాలని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జారీ చేశారని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ... గత విచారణ సమయంలో అడ్వకేట్‌‌ జనరల్‌‌ హాజరై చట్టపరమైన అంశాలపై కౌంటర్‌‌‌‌ దాఖలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు దాఖలు చేయకపోగా, మళ్లీ ప్రభుత్వ న్యాయవాది గడువు కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన రాజ్యాంగ అంశాలు ముడిపడి ఉన్నందున, 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోల అమలును, నిధుల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.