పంజాబ్‌‌లో సమీకరణలు  మారుతున్నాయా ? బీజేపీ, అకాలీదళ్ పొత్తు ఎలాంటి మార్పును తీసుకురాగలదు ?

పంజాబ్‌‌లో సమీకరణలు  మారుతున్నాయా ? బీజేపీ, అకాలీదళ్ పొత్తు ఎలాంటి మార్పును తీసుకురాగలదు ?

2026 ఆగస్టు 7న ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ,  శిరోమణి అకాలీదళ్(ఎస్‌‌‌‌‌‌‌‌ఏడీ) అధినేత సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ బాదల్ మధ్య రాజకీయ వర్గాలు ఊహించని విధంగా జరిగిన సమావేశం పంజాబ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 2020లో బీజేపీ, అకాలీదళ్ తమ పొత్తును తెంచుకున్నాయి. ప్రధాని మోదీ,  అకాలీదళ్​ చీఫ్​ సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ బాదల్ సమావేశం నేపథ్యంలో ఒకవేళ బీజేపీ, అకాలీదళ్ కలిసి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమవుతుందనేది ఇప్పుడు అందరి  మదిలో  మెదులుతున్న ప్రశ్న.

1920లో ఏర్పాటైన అకాలీదళ్ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ రాజకీయ ఉద్యమం ఫలితంగా 1966 నవంబర్ 1న పంజాబ్  రాష్ట్రం ఏర్పడింది.  పంజాబ్ జనాభా సుమారు 3 కోట్లు.  భారతీయ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా శాతం ఇక్కడే అత్యధికం (సుమారు 32%).  జనాభాలో సుమారు 25% వాటా కలిగిన జాట్ సిక్కులు, పంజాబ్‌‌‌‌‌‌‌‌లో  భూమిపై యాజమాన్యం,  రాజకీయ ప్రభావం కలిగిన అతిపెద్ద వర్గంగా ఉన్నారు. మాజీ  రాష్ట్రపతి  జైల్‌‌సింగ్,  మాజీ ముఖ్యమంత్రి అయిన చరణ్‌‌‌‌‌‌‌‌జిత్ సింగ్‌‌‌‌‌‌‌‌ చన్నీ మినహా దాదాపు ముఖ్యమంత్రులు అందరూ జాట్ సిక్కులే.

2017లో జరిగిన  పంజాబ్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం సాధించగా అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు.  వివిధ కారణాల వల్ల రాహుల్ గాంధీ అమరీందర్ సింగ్‌‌‌‌‌‌‌‌ను తొలగించి, ఆయన స్థానంలో దళిత రాజకీయ నాయకుడైన  సి.ఎస్. చన్నీని నియమించారు. 32% ఉన్న దళితులు ఆయనకు ఓటు వేస్తారని భావించడం దీనికి కారణం.  కానీ వారు అలా చేయలేదు. 2022 రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపాలై కేవలం 22% ఓట్లను మాత్రమే సాధించింది. ఆప్ (కేజ్రీవాల్ పార్టీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పంజాబ్  ఫిబ్రవరి 2027లో జరిగే అత్యంత ఊహించని అసెంబ్లీ ఎన్నికల దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) పంజాబ్‌‌‌‌‌‌‌‌లో అధికారంలో ఉండగా,  కాంగ్రెస్  ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.  గతంలో  మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, అకాలీదళ్ కూడా గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించాయి.  ప్రధాని మోదీ,  సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్  బాదల్ సమావేశం తర్వాత  ఎన్నికల రాజకీయ  సమీకరణాలన్నీ మారిపోయాయి. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు,  2024 పార్లమెంట్  ఎన్నికలలో చతుర్ముఖ పోటీ (నాలుగు  ప్రధాన పార్టీల మధ్య పోటీ) జరిగింది, అప్పుడు బీజేపీ,  అకాలీదళ్ విడివిడిగా  పోటీచేశాయి. ఇప్పుడు బీజేపీ, అకాలీదళ్ మళ్లీ ఏకమయ్యే అవకాశం ఉంది.

2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల తీర్పు
2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలలో  కాంగ్రెస్ 26.30% ఓట్లతో 13 స్థానాల్లో 7 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆప్  26.02% ఓట్లతో 3 స్థానాలను గెలుచుకుంది. అకాలీదళ్ కేవలం ఒక స్థానాన్ని గెలుచుకున్నప్పటికీ, 13.42% ఓట్ల వాటాను నిలుపుకుంది.  బీజేపీ ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ, 18.56% ఓట్లను సాధించి గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. బీజేపీ, అకాలీదళ్ కలిసి 31.98% ఓట్లను సాధించాయి. ఇది కాంగ్రెస్  లేదా  కేజ్రీవాల్ పార్టీ ఆప్  సాధించిన ఓట్ల కంటే చాలా ఎక్కువ.

బీజేపీ, అకాలీదళ్ పొత్తు ఎలాంటి మార్పును తీసుకురాగలదు ?
రైతుల ఆందోళన సమయంలో విడిపోయే ముందు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ దీర్ఘకాల మిత్రపక్షాలుగా ఉండేవి. ఆ తర్వాత ఈ రెండు పార్టీలు 2022 పంజాబ్ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలలో విడివిడిగా పోటీచేసి ఘోర  పరాజయాన్ని చవిచూశాయి. బీజేపీ, అకాలీదళ్ ఎప్పటికీ కలవవని,  తద్వారా తమ ఓట్లు చీలిపోతాయని ఆమ్ ఆద్మీ పార్టీ,  కాంగ్రెస్ భావించాయి. కానీ 60 ఏళ్ల క్రితం మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ అన్నట్లుగా ‘రాజకీయాల్లో ఒక వారం అనేది చాలా సుదీర్ఘమైన సమయం’.

అకాలీదళ్ అధినేత సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్  సింగ్ బాదల్,  ప్రధాని మోదీ మధ్య జరిగిన ఒక ఆకస్మిక సమావేశంతో పంజాబ్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ వాతావరణం అకస్మాత్తుగా అనూహ్యంగా మారింది.  అయితే,  ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక పొత్తు ప్రకటించకపోవడం కీలకం.

సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ బాదల్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య జరిగిన ఇటీవలి సమావేశం జరిగిన  నేపథ్యంలో  రాజకీయ పొత్తులు మారి బీజేపీ,  శిరోమణి అకాలీదళ్  పొత్తు ఏర్పరచుకుంటే  అది రెండు పార్టీలకు అత్యంత కీలకమైన పరిణామం కావచ్చు.  విడివిడిగా పోటీ చేయడంవల్ల తాము ఓడిపోతామని ఆ రెండు పార్టీలు 2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో గ్రహించాయి.

బీజేపీ 18.56% ఓట్లు సాధించినా  ఒక్క సీటు కూడా గెలవలేదు. శిరోమణి అకాలీదళ్​13.42% ఓట్లు సాధించినా కేవలం ఒక పార్లమెంట్ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఈ రెండు పార్టీల ఓట్ల మొత్తం కాంగ్రెస్, ఆప్ ఓట్ల కంటే చాలా ఎక్కువ. కాబట్టి, వారి పునఃకలయిక ఒక ముఖ్యమైన ఎన్నికల పరిణామం అవుతుంది. దీంతో  పంజాబ్‌‌‌‌‌‌‌‌లో  త్రిముఖ పోటీకి దారితీయవచ్చు. అంతేకాకుండా  బీజేపీ, అకాలీ దళ్‌‌‌‌‌‌‌‌లో మాజీ  ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌‌‌‌‌‌‌‌తో సహా అనేకమంది ప్రముఖ నాయకులు ఉన్నారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో అంతర్గత అసమ్మతి సమస్య
కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలహీనత బహుశా ఆ పార్టీ స్వయంకృతం కావచ్చు.  ఎన్నికలకు ముందు పార్టీలో క్రమశిక్షణను పెంచడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కానీ పంజాబ్ ఓటర్లు చారిత్రాత్మకంగా తీర్పునిచ్చే వ్యక్తులు.  స్థానిక నాయకత్వానికి  బలంగా స్పందిస్తూ వచ్చారు.  మాజీ  ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్  బీజేపీలో ఉన్నారు.  అకాలీ దళ్‌‌‌‌‌‌‌‌కు చెందిన బాదల్ కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

అసలైన పోరు
2027 ఎన్నికల ఫలితాలను ఏ పార్టీకి అత్యధిక ఓట్ల శాతం వచ్చిందనే దానికంటే, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లను ఎవరు తమవైపు తిప్పుకోగలిగారనే అంశం నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీచేస్తే  వారి కూటమి  పంజాబ్‌‌‌‌‌‌‌‌లో బలమైన రాజకీయ ప్రత్యర్థిగా అవతరించవచ్చు. ఆప్‌‌‌‌‌‌‌‌కి  ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించవచ్చు. అందువల్ల, పంజాబ్ ఆసక్తికరమైన త్రిముఖ పోరు దిశగా సాగే అవకాశం ఉంది.

అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉండటం వల్ల, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లు తమకే వస్తాయని, తద్వారా తామే గెలుస్తామని కాంగ్రెస్ భావించింది. కానీ గతంలో బీజేపీ,  అకాలీదళ్ 40 ఏళ్లపాటు మిత్రపక్షాలుగా ఉన్నాయి.  అవి మళ్లీ  ఏకమవుతాయన్న సంకేతాలు వెలువడటం ఆప్,  కాంగ్రెస్  రెండింటినీ కలవరపెట్టాయి.

కాంగ్రెస్ సంప్రదాయ బలం, బీజేపీ, శిరోమణి  అకాలీదళ్‌‌‌‌‌‌‌‌ కూటమి పునరుజ్జీవం మధ్య పోటీ నెలకొనవచ్చు. తదుపరి ఎన్నికల ఫలితాలను ఓటర్ల మద్దతులో వచ్చే చిన్నపాటి మార్పు సైతం నిర్ణయించవచ్చు.  కానీ ఆ మార్పే రాబోయే ఐదేళ్లపాటు పంజాబ్‌‌‌‌‌‌‌‌ను ఎవరు పాలించాలనేది నిర్దేశించవచ్చు.  ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కాబట్టి వేచి చూద్దాం.  పైగా రాజకీయాల్లో ‘2 ప్లస్ 2’ ఎప్పుడూ ‘4’ అవుతుందని చెప్పలేం. 2022లో  ఓటమి తర్వాత పాటియాలా మాజీ పాలకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని అందరూ భావించారు.  కానీ, అమరీందర్ సింగ్ మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ఆప్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ?
ఆప్ అధికారంలో ఉన్న పార్టీగా కొంత ప్రయోజనంతో ఎన్నికల  బరిలోకి దిగుతున్నప్పటికీ,  అదే సమయంలో గణనీయమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన  సవాలు కూడా ఉంది.

భగవంత్ మాన్  ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజల మద్దతు బాగానే ఉంది.  అయితే  ఒక విషయం  గుర్తుంచుకోవాలి.  2022లో కేజ్రీవాల్  పార్టీ  ఆప్  గెలిచినప్పుడు బీజేపీ,  అకాలీదళ్  విడివిడిగా  పోటీచేశాయి. కాబట్టి,  ఒకవేళ జరగబోయే ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే...  అధికారిక  ఆప్‌‌‌‌‌‌‌‌తోపాటు కాంగ్రెస్  కూడా  పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.