5 అక్టోబర్ 2026న 209వ ఇండియన్ ఇంగ్లిష్ దినోత్సవం. ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ (పీఏసీపీఈటీ) తెల్లాపూర్‌లో తన క్యాంపస్‌లో అక్టోబర్ 4న సావిత్రీబాయి ఫూలేను ‘మదర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’గా ప్రకటించబోతున్నది. అయితే 5న సోమవారం అయినందున 4 అక్టోబర్ నాడు 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.
సావిత్రిబాయి ఫూలేను ఇండియన్ ఇంగ్లిష్ తల్లిగా ప్రకటించడానికి కారణమేమిటి? ఇప్పుడే ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఆమెకాక మరే ఇతర స్త్రీని ఎందుకు ప్రకటించడం లేదు? అనే ప్రశ్నలు చాలామందికి తడతాయి. సావిత్రి బాయి 1831లో పుట్టింది. 1854లో ఆమె ‘కావ్య ఫూలే’ అనే మరాఠీ కవితల పుస్తకాన్ని ప్రచురించింది. అందులో ఒక కవిత ‘మదర్ ఇంగ్లిష్’ ఈ కవితలో ఆమె ఇంగ్లిష్ భాష భారతదేశానికి రావడంతో ఇక్కడి శూద్ర, దళిత, ఆదివాసీ బానిస బతుకులు మారనున్నాయని, చీకటి పారదోలడం జరుగుతుందని రాసింది.
18వ శతాబ్దం మొదటి దశకం నాటికి బ్రిటిష్ వారు ముస్లిం రాజులను ఓడించి దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ దశలో రాజారామ్మోహన్ రాయ్, దాదాబాయి నౌరోజీ, మహాత్మా ఫూలే, సావిత్రి బాయి ఫూలే బ్రిటిష్‌వారు ప్రవేశపెడుతున్న ఇంగ్లిష్ విద్య, సంస్కరణ చట్టాలు మన మంచికే అనుకున్నారు. వాటికి మద్దతిచ్చారు. అయితే బ్రాహ్మణ స్త్రీలలో కూడా ఇంగ్లిష్ రానిరోజుల్లో శూద్ర సమాజానికి చెందిన సావిత్రిబాయిలాగ చదువుకుని, అదీ భర్త నేర్పగా ఇంగ్లిష్ ఎంతోకొంత నేర్చుకున్న స్త్రీలు లేరు.
ఆమె అమెరికన్ మిషనరీలు స్థాపించిన మిషనరీ టీచర్ ట్రైనింగ్ స్కూల్లో ఫాతిమాషేక్‌తోపాటు చేరి ఇంగ్లిష్ నేర్చుకుని టీచరైంది. ఆ క్రమంలో ఆమెకు ఇంగ్లిష్ సులభంగానే నేర్చుకోదగ్గ భాష అని అర్థమైంది. అది అన్ని కులాల ఆడపిల్లలకు నేర్పాలనే ఆరాటం ఆమెలో పెరిగింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ విద్యారహితం కోసం ఒత్తిడి
ఆ స్థితిలో ఆమె ఇంగ్లిష్ భాష ఎలా శూద్ర, దళిత, ఆదివాసులను, స్త్రీలను విముక్తి చేస్తుందో ఊహకందని పద్ధతిలో ‘మదర్ ఇంగ్లిష్’ పోయమ్‌లో చెప్పింది. ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రభుత్వం, ఆ శక్తులు పరిపాలించే రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఇంగ్లిష్ విద్యారహితం చేసి, ప్రాంతీయ భాషలకు కుదిస్తున్నారు. రాష్ట్రాలు దాటిపోయిగానీ, దేశం దాటిపోయిగానీ ఉద్యోగాలు సంపాదించుకునే భాష వారికి లేకుండా వారిని చిన్న చిన్న ప్రాంతాలకు కదిలించాలని వారి ప్లాను. అదే సందర్భంలో దేశంలోని మొనోపలి కంపెనీలు అమెరికన్ సిలబస్‌లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే నడిపే స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సీటీలు పెట్టడాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ప్రభుత్వ భూములను వారికి అప్పజెప్పుతున్నారు. అంతేకాదు అమెరికా, యూరోపియన్ యూనివర్సిటీలను ఇక్కడ పెట్టి వ్యాపారం నడుపుకోండని ప్రోత్సహిస్తున్నారు. ఇదెంత అన్యాయం. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలలో పనిచేసి పిల్లలుగన్న నాయకులు మాత్రం ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లల్లో తమ పిల్లలను లక్షల ఖర్చుతో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో, విదేశాల్లో చదివిస్తున్నారు.
చివరికి కొట్లాడి కొట్లాడి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకోకుంటే ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మళ్లీ తెలుగు మీడియంలోకి మార్చేయాలని ఈ ధనవంతులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో తెలంగాణ నుంచి కే.కేశవరావు కూడా చేరారు.
ఈ స్థితిలో సావిత్రి బాయి ఫూలే రాసిన ఒక బ్రహ్మాండమైన పోయమ్‌ను ఇక్కడ చదవండి..
ఇంగ్లిష్ మదర్
‘పీశ్వాల రాజ్యం పోయింది.. తల్లి ఇంగ్లిష్ వచ్చింది.. దిక్కులేని మా నిరాశజీవితం అంధకారంగా ఉండే, స్వర్గ–నరకాల భయంలో కొట్టుమిట్టాడించిన బతుకులు మావి. ఆ భయానక మా బతుకుల్లోకి, ఇంగ్లిష్ తల్లి వచ్చింది, ఇది ఇక మారే కాలం. మూఢ నమ్మకాల కాడిని విసిరేద్దాం. ఓ ఆత్మ బంధువులారా! ఇది మన అదృష్ట దశ.. మనువు దారులన్నీ దయ్యాల దారులు, ఆకలి, అణచివేతలలో అల్లాడిన బతుకు మనది. మాయచేసి మనలను వాళ్లు దోచుకున్నారు, అణచివేశారు. ఇంగ్లిష్ తల్లి రాకతో వాళ్లంతా మాయమౌతారు.
బ్రాహ్మణ పాలన బూడిదపాలైతది. ఇంగ్లిష్ (భాష) దాడిదెబ్బల్లో అది ఆగమైతది. మనందరి మంచికే ఇంగ్లిష్ వచ్చింది. మను ఇంగ్లిష్ దర్వాజ దగ్గర చస్తడు. జ్ఞానం బీదవారి ఆత్మ, బతుకునీడ, ఇంగ్లిషు తల్లి మనల్ని చేరదీస్తది. ఇంగ్లిష్(భాష) పాలనలో మనకు సుఖం దొరుకుతది. తల్లి ఇంగ్లిష్ మన భయాన్ని కడిగింది. ఇంగ్లిష్ పర్షియన్, బ్రాహ్మణ, యమని, హునుల సొత్తుకాదు.
మన రక్తనాడుల్లో నిజమైన ఇండియన్ రక్తమున్నది. గట్టిగా అరవండి! మొత్తుకోండి! ఇంగ్లిషు తల్లీ రా! పోయి చదువుకోండి, కష్టపడండి, స్వతంత్రులు కండి, శ్రమతో జ్ఞానం, సంపద పొందండి. జ్ఞానం లేకపోతే అన్నీ పోతయి, జ్ఞానరహిత జంతువులు కాకండి.
ఇక మౌనంగా కూర్చోకండి, పోయి చదువుకోండి. పీడన, అణచివేతలను అధిగమిద్దాం. మనకి బంగారు బతుకొస్తుంది. జ్ఞానవంతులై కుల బంధాలను తెంచండి’. ఆమె 172 ఏండ్ల కింద రాసినది ఈ కవిత. ఆధునిక ప్రపంచంలో వందలేండ్లు శూద్ర, దళిత, ఇంగ్లిష్ మీడియం విద్య విముక్తి శక్తిని ఆమె అర్థం చేసుకుంది.
ఇంగ్లిష్ భాష దేశ ఐక్యతకు మూలాధారం
ఈ విషయాన్ని మరో భారతీయ స్త్రీగానీ, పురుషుడుగానీ అర్థం చేసుకోలేదు. మహాత్మా ఫూలేను కూడా గులాంగిరి రాయమని ఆమె వెంటపడ్డది. ఆమె రచన ప్రాముఖ్యతను చదువుతో మార్చే స్త్రీ. దళిత, శూద్ర, ఆదివాసీ ఎలా సంపూర్ణ విముక్తి పొందుతారో ఆమె కనిపెట్టింది. ఇప్పటికీ ఇంగ్లిష్ భాష దేశ ఐక్యతకు మూలాధారంగా మారినది. అన్ని రాష్ట్రాల్లో, గిరిజన ప్రాంతాలతో సహా పిల్లల చేతిలో ఇంగ్లిష్ పుస్తకం లేని ఇల్లు ఉండదు.
ఎంత ఇంగ్లిష్‌ను దేశ భాషగా మార్చకుండా హిందీని చొప్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా హిందీ అక్షరాలు కూడా నేర్చుకోని కోట్లమంది యువతీ యువకులు ఉంటారు. కానీ ఏబీసీడీ.. జడ్ వరకు రాని పిల్లలు ఉండరు. ఇంగ్లిష్ పదాలు తమ నిత్య జీవితంలో వాడని స్త్రీ–పురుషులు ఉండరు. ముస్లింలను కూడా అన్ని కులాలవారితో కమ్యూనికేట్ చేయగలిగే భాష ఇండియాలో
ఇంగ్లిష్ మాత్రమే.
తెలంగాణ-సావిత్రి బాయి
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని టీచర్స్ డేగా ప్రకటించింది. నెక్లెస్ రోడ్ పార్కులో సావిత్రి బాయి – ఫూలే విగ్రహాలను పెట్టారు. ఫూలే సినిమాను తెలుగులోకి అనువదించి పాఠశాలల్లో పిల్లలకు చూపించాలని చెప్పారు.
కానీ ఎన్ని స్కూళ్లల్లో ఆ సినిమా చూపిస్తున్నారో తెలవదు. గత 15 సంవత్సరాలుగా అక్టోబర్ 5న ఇంగ్లిష్ దినోత్సవాన్ని వివిధ చోట్ల జరుపుకుంటున్నాం. కానీ ఎవరైతే లక్షలు పెట్టి తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లల్లో చదివిస్తున్నారో వారు ఇంగ్లిష్ దినోత్సవాన్ని స్కూళ్లల్లో తమ పిల్లల మధ్య జరుపుకోవడానికి భయపడుతున్నారు. అందుకే వీరందరికీ సావిత్రి బాయి ఎందుకు ఆదర్శం కావాలో ఫూలే– అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ (పీఏసీపీఈటీ) తెల్లాపూర్ ఆమెను ‘మదర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’గా ప్రకటిస్తున్నది.
ఆరోజు విద్యార్థులే ఇంగ్లిష్‌లో ఉపన్యసిస్తారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం ఉండాలని దశాబ్దాలుగా నేను తెలుగులో, ఇంగ్లిషులో రాస్తున్నాను. మాట్లాడుతున్నాను. ఇంగ్లిష్ భాషపైన నీకింత ప్రేమ, పట్టు ఎలా దొరికిందని చాలామంది అడుగుతున్నారు. అది తెలుసుకోవాలంటే కొత్తగా బయటకొచ్చిన ‘ఎ శూద్ర లైఫ్’ అనే నా ఆత్మకథ చదవాలి. బహుశా నేను అక్టోబర్ 5నే పుట్టినందుకు కావొచ్చు.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
