ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక వృత్తిని ఉన్నత విద్యావ్యవస్థలో అత్యున్నతమైన, గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు. ఈ ఉద్యోగాల కోసం ఎంతోమంది అభ్యర్థులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే డిగ్రీ కళాశాల లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో.Ms.No.4 సమాన అవకాశాలు, పారదర్శకత, అభ్యర్థుల ప్రతిభ అంచనాపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ నేపథ్యంలో దశాబ్ద కాలం తర్వాత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశతోపాటు ఆందోళన కూడా మొదలైనది. గతంలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నియామకాలు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరిగేవి.
ప్రస్తుతం నూతనంగా తెచ్చిన జీవో ప్రకారం డిగ్రీ కళాశాల అస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో అకడమిక్ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. మొత్తం ఎంపికలో అకడమిక్ ప్రతిభకు సగం వాటా ఇవ్వడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో పలు
సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అకడమిక్ ప్రతిభ అందరికి సమానంగా ఉంటుందా?
డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో జీవో 4 ప్రకారం 100 మార్కులకుగాను అకడమిక్ ప్రతిభకు అత్యధికంగా 50 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఇందులో డిగ్రీ, పీజీలో 80శాతం మార్కులు దాటితే గరిష్టంగా 8, 12 మార్కులు ఇస్తున్నారు. తక్కువైతే మార్కులు తగ్గుతాయి. నెట్/ సెట్ అర్హతకు 5 మార్కులు కేటాయించారు.
పీహెచ్‌డీకి 10, పరిశోధనా ప్రచురణలకు 5, సెమినార్ ప్రజెంటేషన్‌కు 5, జేఆర్‌ఎఫ్‌కు 10 మార్కులు కేటాయించారు. ఇవన్నీ ప్రధానంగా పీహెచ్‌డీ అభ్యర్థులకే అనుకూలంగా ఉండే వెయిటేజీలుగా మారుతున్నాయి. డిగ్రీ, పీజీ మార్కులపై అభ్యర్థుల సామాజిక, ఆర్థిక నేపథ్య ప్రభావం చూపే అవకాశం ఉంది.
గ్రామీణ–పట్టణ, ప్రభుత్వ–ప్రైవేట్ , విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసం ఉంటుంది. సామాజిక వర్గాలపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి లభించే విద్యా వనరులు, సదుపాయాలు భిన్నంగా ఉంటాయి. అకడమిక్ స్కోరింగ్‌లో పీహెచ్‌డీ ఉన్నవారికి దాదాపు 25 మార్కులు లభించే అవకాశం ఉండటంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకడమిక్ స్కోర్‌కు వెయిటేజ్ ఇవ్వడం విద్యార్ధుల సమాన అవకాశాలకు విఘాతం కలిగిస్తుందనీ, కొందరికే అనుకూలంగా మారుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత పరీక్ష ద్వారానే నియామకాలు చేపట్టాలి
యూజీసీ నిబంధనల ప్రకారం ఎంట్రీ- లెవల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నెట్/సెట్ ప్రాథమిక అర్హతలు కాగా, పీహెచ్‌డీ తప్పనిసరి కాదు. ఈ క్రమంలో నెట్, సెట్ పరీక్షను క్వాలిఫై కావడానికి లక్షలాదిమంది విద్యార్థులు పోటీపడతారు. ఇప్పుడు నెట్/సెట్‌కు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మళ్ళీ ఇంటర్వ్యూ ప్రవేశపెట్టడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్వ్యూ విధానంలో గతంలోనూ అనుమానాలు వ్యక్తం కావడంతో టీజీపీఎస్సీ సైతం ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. కావున ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీ ప్రక్రియలో మెరిట్, పారదర్శకత, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం.
ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్‌కు తెచ్చిన జీవో 29 వలన అనేక ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ప్రస్తుతం డిగ్రీ కాలేజీ లెక్చరర్ నియామకాల్లో జీవో–4 ఎంపిక ప్రక్రియపై మరోసారి అనుమానాలకు
తావిస్తోంది. కావున రాత పరీక్ష ద్వారా పకడ్బందీగా, పారదర్శకంగా నియామకాలు చేపట్టినప్పుడే ప్రతిభకు సమాన అవకాశం లభిస్తుంది.
- సంపతి రమేష్, సోషల్ ఎనలిస్ట్-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
