స్టెప్పులేసిన సీపీ సజ్జనార్‌‌‌‌..నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసుల సంబురం

స్టెప్పులేసిన సీపీ సజ్జనార్‌‌‌‌..నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసుల సంబురం

హైదరాబాద్‌‌, వెలుగు: గణేశ్​శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్‌‌ సిటీ పోలీసులు సంబురాలు చేసుకున్నారు. దాదాపు 48 గంటలపాటు సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర విజయవంతంగా ముగియడంతో శనివారం ఉత్సాహంగా గడిపారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె.మూర్తి, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ సజ్జనర్ సరదాగా స్టెప్పులేశారు. గణేశ్​నిమజ్జనం ముగిసిన అనంతరం సచివాలయం సమీపంలో సీపీ మీడియాతో మాట్లాడారు.

ఏసీపీ(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్‌‌‌‌ ఇక్బాల్‌‌, జాయింట్ సీపీ(ట్రాఫిక్‌‌) జోయల్‌‌ డేవిస్ సహా ఇతర పోలీస్ అధికారులతో కలిసి శోభాయాత్ర, నిమజ్జనం వివరాలు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున శోభాయాత్ర ప్రధాన మార్గాలైన ఎంజే మార్కెట్, బషీర్‌‌బాగ్, లిబర్టీ, ట్యాంక్‌‌బండ్ తదితర ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ బైక్‌‌ పై పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల్లో క్రమశిక్షణ అవసరం: సీపీ సజ్జనార్‌‌‌‌

నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజల్లో సెల్ఫ్​డిసిప్లేన్ అవసరమని సీపీ సజ్జనార్ అన్నారు. రోడ్లపై అన్నదాన వ్యర్థాలను వదిలేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అశ్లీల నృత్యాలు చేయడం వంటి అంశాల్లో నిర్వాహకులు, ప్రజలు స్వయం క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సీపీ సూచించారు. ఈ అనుభవాలతో రాబోయే 2027 గణేష్ ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తామని వివరించారు.

ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్‌‌ను దాదాపు 30 లక్షల మంది, బాలాపూర్ గణేష్‌‌ను 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. బందోబస్తు కోసం హైదరాబాద్ సిటీ పోలీస్‌‌కు చెందిన 20 వేల మంది సిబ్బందితో పాటు జిల్లాల నుంచి దాదాపు 8వేల మందికి పైగా అదనపు సిబ్బందిని, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీజీఎస్‌‌పీ విభాగాల బలగాలను వినియోగించామని తెలిపారు.