ఖమ్మం టౌన్, వెలుగు: ట్యాంకర్ ను దారి మళ్లించి మార్గమధ్యలో పామాయిల్ అమ్మకుంటున్న డ్రైవర్ షేక్ ఖమ్రుద్దీన్, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పామాయిల్ వ్యాపారి చిద్దెల్ల కనకయ్య, ఆటో డ్రైవర్ గోపినాథ్, ఉద్యోగి దారా శ్రీనివాస్ రావును అరెస్ట్ చేసినట్లు టౌన్ ఏసీపీ ఎస్వీ రమణమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని చింతలపూడి సీతానగరంలో ఉన్న గోద్రెజ్ అగోపెట్ పామాయిల్ కంపెనీ నుంచి ప్రతి రోజు హైదరాబాద్ కు పామాయిల్ రవాణా చేసేవారు.
ఈక్రమంలో కంపెనీలోకి వెళ్లే ముందు ట్యాంకర్ లో నీళ్లు నింపి, రాళ్లతో ఎక్కువ బరువు వచ్చేలా చూపించి, అదే పరిమాణంలో పామాయిల్ ను బయటకు తీసుకొచ్చేవారు. ఇలా తీసుకొచ్చిన పామాయిల్ ను కోదాడ, సూర్యాపేట పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు అమ్ముతున్నారు.
రెండేళ్లుగా ఇలా చేస్తుండగా, ఈ నెల 23న కంపెనీ మేనేజర్ వకలపూడి రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద ట్యాంకర్, 31 క్యాన్లు, ఆటో,4 ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఫేరోజుద్దీన్, జయరాజు, చంటి, బాలాంజనేయులు, చౌదరి, నరేశ్, కల్లూరు రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
